తెలుగు360 రేటింగ్: 2/5
క్రైమ్ కథలెందుకు ఆసక్తికరంగా ఉంటాయో తెలుసా? అందులో ఎన్నో కొన్ని తెలివితేటలు దాగుంటాయి. కన్నింగ్ కథల్లో అవి ఇంకా మెండుగా ఉంటాయి. ఒకరిని మోసం చేయడం అంత సులభం కాదు. మనిషులకు అసలే అతి తెలివి. వాళ్లని బురిడీ కొట్టించడానికి ఇంకెంత తెలివి కావాలి. అందుకే `మోసగాళ్లు` ఇప్పుడు టెక్నాలజీనీ వాడుకుంటున్నారు. ఈ రాష్ట్రం వాళ్లని, పక్క రాష్ట్రం వాళ్లనీ, అవసరమైతే.. పక్క దేశం వాళ్లనీ ఈజీగా మోసం చేసేస్తున్నారు. కొన్ని కథనాలు వింటే.. `ఇలాక్కూడా జనం మోసపోతుంటారా` అనిపిస్తుంటుంది. `మోసగాళ్లు` సినిమాకి కథా వస్తువు అలాంటిదే. మరి… విష్ణు.. విస్తుపోయే తెలివితేటలతో ఈ సినిమా తీయగలిగాడా? లేదంటే తన అతి తెలివిని చూపించాడా?
కథ క్లుప్తంగా చెప్పుకుంటే.. అను (కాజల్), అర్జున్ (విష్ణు) ఇద్దరూ అక్కా తమ్ముళ్లు. పేదరికంలో పుట్టారు. పేదవాళ్లుగా చనిపోవడం మాత్రం ఇష్టం లేదు. అందుకే ఎలాగైనా సరే.. డబ్బు సంపాదించాలని అనుకుంటారు. అందుకోసం.. ఉన్నవాళ్లని మోసం చేయడం తప్పు కాదని భావిస్తారు. ఓ కాల్ సెంటర్ ని ఏర్పాటు చేసి, అమెరికన్ల నుంచి డబ్బులు వసూలు చేస్తారు. అలా ఏకంగా వందలు, వేల కోట్ల రూపాయలు కూడబెడతారు. అసలే అమెరికావాళ్లతో వ్యవహారం. ఈ స్కామ్ ని అమెరికా ప్రభుత్వం పసిగడుతుంది. వాళ్లు… ఈ మోసాన్ని ఎలా బట్టబయలు చేశారు? ఈ స్కామ్ ని ఎలా కనుగొన్నారు? డీసీపీ కుమార్ భాటియా (సునీల్ శెట్టి) ఈ గ్యాంగ్ ని ఎలా పట్టుకున్నాడు? అనేదే కథ.
ఓ మోసం – దాని కోసం పన్నిన పన్నాగం – దాన్ని బట్టబయలు చేసిన విధానం – ఏ క్రైమ్ కథైనా ఇలానే ఉంటుంది. ఏం మోసం, అందుకోసం ఎలాంటి తెలివితేటల్ని వాడారు? దాన్ని ఏ విధంగా పోలీసులు కనిపెట్టారు? అనే విషయాల్లోనే వైవిధ్యం చూపించాలి. ఇది నిజంగా జరిగిన కథ అని విష్ణు చెబుతున్నాడు. నిజంగా ఇది జరిగే ఉండొచ్చు. కాకపోతే.. ఇలాగైతే జరిగి ఉండదేమో అనిపిస్తోంది. జరిగిన కథకి సినిమాటిక్ లిబర్టీని చాలా వరకూ వాడేసుకున్నారు.
మోసం చేయడం, మోస పోవడం అనే విషయాల్లో ఆసక్తి ఎప్పుడూ ఉండదు. ఆ మోసం చేసిన విధానంలో.. తెలివి తేటలు చూపిస్తేనే ప్రేక్షకుడికి ఆసక్తి కలుగుతుంది. `ఓహో.. మోసాలు ఇలా క్కూడా చేస్తారా` అనిపించేలా ఉంటే… కథపై, కథనంపై ప్రేమ కలుగుతుంది. `స్వామి రారా`, `కనులు కనులను దోచాయంటే` సినిమాల్లోనూ హీరోలు ఈజీగా మోసం చేసేస్తుంటారు. ఆయా సన్నివేశాల్లో లాజిక్కులు ఉంటాయి. మోసగాళ్లలో.. లేనిది అదే. తెరపై ఏదోదో జరిగిపోతుంటుంది. లాప్ టాప్లను ఎదురు పెట్టుకుని, మీటలు నొక్కేసి, స్క్రీన్ పై ఏవోవే చూపిస్తుంటారు. అవేం ప్రేక్షకుడికి అర్థం కావు. అమెరికన్లు, అక్కడి ప్రభుత్వాలు, అక్కడి సెక్యురిటీ సిస్టమ్ మరీ.. అంత చీప్ గా కనిపిస్తుందా? అనిపిస్తోంది. అమెరికాలో బలమైన వ్యవస్థ ఉంది. అక్కడి పోలిసింగ్ శక్తి.. శక్తిమంతంగా ఉంటుంది. ప్రపంచంలో ఎక్కడ ఎలాంటి ఫ్రాడ్ జరిగినా.. దానికి సంబంధించిన సమాచారం అమెరికా దగ్గర ఉంటుందని గొప్పగా చెప్పుకుంటాం. అలాంటిది.. వాళ్లకే వీపీలుగా మార్చి, హీరో డబ్బు సంపాదించాడంటే.. దాని కోసం ఎన్ని తెలివితేటలు వాడాలి? అవేం మోసగాళ్లలో కనిపించదు. నిజానికి ఈ కథపై కథకుడు (విష్ణు) పెద్దగా కసరత్తు చేసినట్టు అనిపించదు. ఇలాంటి కథల్ని ఎంచుకునేటప్పుడు.. ఈ ఫార్మెట్ లో గతంలో వచ్చిన కొన్ని సినిమాల్ని రిఫర్ చేసుకుంటారు. ఏం చేయొచ్చు? ఏం చేయకూడదు? అనే విషయాలపై ఓ అవగాహన కోసం. బహుశా.. ఈ టీమ్ అది కూడా చేసి ఉండదు. ఈ టీమ్ ని పట్టుకోవడానికి డీజీపీ చేసే ప్రయత్నాలు కూడా సిల్లీగా, మరీ రొటీన్ గా అనిపిస్తుంటాయి. దాంతో ప్రేక్షకుడికి ఉన్న ఆ కాస్త ఆసక్తి కూడా పోతుంది. కథ ప్రారంభమై.. అసలు మేటర్ లోకి త్వరగానే వెళ్లిపోయినా.. ఆ తరవాతి తతంగంలో.. ఏమాత్రం కొత్తదనం లేకపోవడంతో.. సగం సినిమా అయ్యే సరికి పూర్తి సినిమా చూసేసిన ఫీలింగ్ ఏర్పడుతుంది. ద్వితీయార్థంలోనూ అవసరం లేని హడావుడి ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఈ సినిమాకి 50 కోట్లు ఖర్చు పెట్టేశామని చిత్రబృందం చెప్పేసినా.. తెరపై అది ఏమాత్రం కనిపించదు. విష్ణు గత చిత్రాలకంటే కాస్త క్వాలిటీ ఉంటుందంతే.
విష్ణు చాలా సోసోగా చేసుకుంటూ వెళ్లిపోయాడు. తనని పరీక్ష పెట్టే కథ కాదిది. కాకపోతే.. తనకు ఈ జోనర్ కొత్త. కాజల్ ఉంది కాబట్టి, ఆ పాత్రకు కాస్త వెయిట్ వచ్చిందేమో? మిగిలినవాళ్లెవరైనా అయితే తేలిపోతారు. కాజల్ కోసమైనా.. ఆ పాత్రపై ఇంకాస్త శ్రద్ధ పెట్టాల్సింది. సునీల్ శెట్టిని.. హిందీ మార్కెట్ కోసమే తీసుకొచ్చారన్నది అర్థమైపోతోంది. తొలి సగంలో కనిపించింది కాసేపే. ఆ పాత్రని కూడా.. పైపైనే నడిపించేశారు. ఇక మోసగాళ్ల గ్యాంగ్ లో ఉన్న నవదీప్ ఫర్వాలేదనిపించాడు. నవీన్ చంద్ర కాస్త ఓవరాక్షన్ చేసినట్టు అనిపిస్తుంది.
ఈ మాత్రం కథ విష్ణునే రాయాలా? ఈ సినిమాని హాలీవుడ్ డైరెక్టరే తీయాలా? అని సినిమా చూశాక అనిపిస్తే.. అది ప్రేక్షకుల తప్పు కాదు. ఫొటోగ్రఫీ, కెమెరాపనితనం, ఎడిటింగ్ ఇవన్నీ హాలీవుడ్ స్థాయిలో ఉన్నాయని మంచు విష్ణు పదే పదే చెప్పుకొచ్చాడు. అవన్నీ విన్నాక… అదేం స్థాయిలో ఉందో అనుకుంటారంతా. కానీ.. సాధారణ స్థాయికంటే తక్కువగానే కనిపించాయి. కథ ఎలా ఉన్నా స్క్రీన్ ప్లే లోపాలు, క్యారెక్టరైజేషన్లో దమ్ము లేకపోవడం, ట్విస్టులు కరువవ్వడంతో.. ఆయా మోసాలన్నీ పైపైనే తేలిపోయాయి.
ఫినిషింగ్ టచ్: మోసపోయేది ప్రేక్షకులే
తెలుగు360 రేటింగ్: 2/5