శుక్రవారం వస్తొందంటే, సగటు సినీ అభిమాని హై అలెర్ట్ కి వచ్చేస్తాడు. శుక్రవారం కొత్త సినిమా పడాల్సిందే. చూడాల్సిందే. కొత్త సినిమా లేకపోతే వీకెండ్ కి మజానే ఉండదు. కరోనా పుణ్యం వల్ల 2020లో ఈ ముచ్చట్లు ఆగిపోయాయి. ఇప్పుడు మాత్రం ప్రతీ వారం మూడు నాలుగు సినిమాలు వస్తూనే ఉన్నాయి. అందులో కనీసం ఏదో ఒకటైనా.. ప్రేక్షకుల మన్ననల్ని పొందుతోంది. గత వారం కూడా మూడు సినిమాలొస్తే.. మూడింటికీ మంచి ఓపెనింగ్స్ వచ్చాయి. వాటిలో `జాతిరత్నాలు` నిలబడిపోయింది. ఈవారం కూడా మూడు సినిమాలు రావడం, మూడింటిపై ఎన్నో కొన్ని ఆశలు ఉండడంతో… సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూశారు. లేటెస్ట్ విజయాలతో బాక్సాఫీసు దగ్గర కాస్త హుషారు కావడంతో, ఈ వారం కూడా ఆ జోరు కొనసాగుతుందని ఆశించారు. కానీ… వాళ్ల ఆశలన్నీ ఆడియాశలు అయ్యాయి.
ఈవారం `చావు కబురు చల్లగా`, `శశి`, `మోసగాళ్లు` విడుదలయ్యాయి. మూడింటికీ ఫ్లాపు టాకే. కొంతలో కొంత.. `చావు కబురు..` నయం. ఈసినిమాకీ నెగిటీవ్ టాక్ బీభత్సంగా ఉంది. కాకపోతే.. మిగిలిన రెండు సినిమాలతో పోలిస్తే వసూళ్లు కాస్త బెటర్ అంతే. ఈ సినిమాకిచ్చిన ప్రమోషన్ తో పోలిస్తే ఇప్పుడు తెగిన టికెట్లు కూడా తక్కువే అనుకోవాలి. తెలుగు ప్రేక్షకులకు జీర్ణం కాని సబ్జెక్టుని పట్టుకుని… దర్శకుడు బాక్సాఫీసు ని ఈదేయాలని చూశాడు. ఫలితం రాలేదు. విష్ణు ఎన్నో ఆశలు పెంచుకున్న మోసగాళ్లు.. సైతం ప్రేక్షకుల్ని మోసం చేసింది. చరిత్రలో కనీ వినీ ఎరుగని భారీ స్కామ్ అని ఊరించి, కాజల్, సునీల్ శెట్టి లాంటి స్టార్లని తీసుకొచ్చి – మసి పూసి మారేడు కాయ చేయాలని చూశారు. కానీ.. వర్కవుట్ అవ్వలేదు. శశిదీ అదే దారి. అసలు ఆది సాయికుమార్ సినిమాలకు హైపే ఉండడం లేదు. `ఒకే ఒక లోకం నువ్వే` పాట దయతో.. ఈ సినిమా చూడాలన్న ఉత్సుకత కలిగింది. దాన్ని తొలి సన్నివేశంలోనే మటాష్ చేశాడు దర్శకుడు. ఏమాత్రం ఆసక్తి లేని కథాకథనాలతో ప్రేక్షకుడి సహనాన్ని పరీక్ష పెట్టారు. మొత్తానికి మూడు సినిమాలూ.. ప్రేక్షకుల్ని రంజింపచేయలేకపోయాయి. దాంతో ఈ ఫ్రైడే కాస్త. డిజాస్టర్ ఫ్రైడేగా మారిపోయింది.