టీవీ9 అధికార పార్టీల రాజకీయ వ్యూహంలో పావుగా మారిపోయింది. ప్రత్యర్థి పార్టీలు.. ఆయా పార్టీల నేతలపై దుష్ప్రచారం చేయడానికి టూల్‌గా ఉపయోగపడిపోతోంది. కనీసం జర్నలిజం బేసిక్స్ కూడా పాటించకుండా లీకుల పేరుతో.. ఊహాగానాల పేరుతో … ఇష్టం వచ్చినట్లుగా ప్రత్యర్థి పార్టీలు.. ఆ పార్టీల నేతలపై బురద చల్లేసి… తమ యజమానికి సన్నిహితమైన పార్టీల నేతలను సంతృప్తి పరుస్తోంది. అదే సమయంలో… ప్రజల్లో తమ వాల్యూ… రోజు రోజుకు పడిపోతోందన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. తమ చానల్‌కు ఓ రాజకీయ ముద్ర పడిపోయిందనే సంగతిని గుర్తు చేసుకోలేకపోతున్నారు.
అసైన్డ్ భూముల కేసుల విషయంలో బాధితులు లేరు.. ఎవరూ ఫిర్యాదు చేయలేదు. అదే సమయంలో… ఎలాంటి ప్రాధమిక ఆధారాలు లేవని.. కేవలం ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసిన ఫిర్యాదు స్టేట్మెంట్లు మాత్రమే ఉన్నాయని ప్రభుత్వ న్యాయవాది చాలా స్పష్టంగా కోర్టులో చెప్పారు. కానీ టీవీ9 జర్నలిజం విలువలకు ఇది కనిపించలేదు. అర్థం పర్థం లేని తోక అంశాలతో లేనిపోని గాలి పోగేసి చెప్పి… ఏదో మైండ్ గేమ్ ఆడే ప్రయత్నం చేసింది. ఇదంతా సాక్షి టీవీలో ఎప్పటినుంచో వస్తున్నవే. వాటిని టీవీ9లో చెప్పి.. ఎవరో భయపెడదామనో.. ఆందోళన చెందేలా చెద్దామనో… లేకపోతే ఎవరినో ప్రభావితం చేద్దామనో… కంగారు పడిపోతోంది. కానీ టీవీ9ని చూసేవారు.. ఒక్క టీవీ9ని మాత్రమే చూడరనే విషయాన్ని వారు మర్చిపోయారు. రాజధాని రైతులు సీఐడీ ఎదుట హాజరై.. స్వచ్చందంగా భూములిచ్చామని చెప్పారు. టీవీ9కి కూడా చెప్పారు. కానీ… ఆ చానల్లో ఆ వార్తను కనిపించనీయలేదంటే… టీవీ9 ఎంత దారుణమైన రాజకీయ చట్రంలో ఇరుక్కుపోయిందో అర్థం చేసుకోవచ్చు.
అదే సమయంలో రూ. రెండు లక్షల పైబడిన నగదు లావాదేవీల వివరాలు కావాలంటూ.. ఐటీకి సీఐడీ లేఖ రాసిందని… అవి రాగానే సాక్ష్యాలు బయటపడతాయంటూ కొత్త కబురు కూడా.. గాలి పోగేసి టీవీ9 చెబుతోంది. బహుశా టీవీ9 జర్నలిస్టులు మర్చిపోయారో.. మర్చిపోయినట్లుగా నటిస్తున్నారో.. ఏడాది కిందటే.. ఇప్పటికే అమరావతిలో అణువుఅణువు పరిశీలించిన సీఐడీ బృందం ఐటీకి లేఖ రాసింది. సమాచారం కోసం అన్ని రకాల ప్రయత్నాలు చేసింది. కానీ అనుమానాస్పద లావాదేవీలు ఏవీ లేవన్న సమాచారం వచ్చిందేమో కానీ అప్పట్లో సైలెంటయింది. ఇప్పుడు మళ్లీ లేఖ రాసి.. ఎవరినో బెదిరిద్దామన్నట్లుగా టీవీ9ని ఉపయోగించుకుంటున్నారు.
నిజాలు రాస్తే.. ఇవాళ కాకపోతే రేపైనా నిజం అని తెలిసినప్పుడు శభాష్ అంటారు. షర్మిల రాజకీయ పార్టీ విషయంలో ఏబీఎన్ అదే విషయాన్ని చెప్పింది… కానీ అందరూ ఎగతాళి చేసారు. అదే నిజం అయింది. అదీ విశ్వసనీయత అంటే. ఇప్పుడు గాలి పోగేసి చెబుతున్న టీవీ9… ఇంత వరకూ ఒక్కటంటే ఒక్కటైనా నిజం చెప్పిందా..? రేవంత్ ఇంట్లో ఐటీ సోదాల దగ్గర్నుంచి ప్రతీది ఫేక్ న్యూసే. దానికి జర్నలిజం సోర్స్ ముసుగు వాడుకుంటున్నారు. గతంలో వార్త దినపత్రిక ఎంత ఎత్తుకు ఎదిగిందో.. ఆ పత్రిక మీద ఓ పార్టీ ముద్రపడే సరికి ఇప్పుడు ఎలా అయిందో… టీవీ 9 గుర్తు చేసుకుంటే ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదు.