ఏపీ టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు … హైదరాబాద్‌కు వచ్చి మంత్రి కేటీఆర్‌తో సమావేశమయ్యారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతూండటంతో.. గంటా .. నేరుగా తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు. అక్కడే ఆయనతో కాసేపు సమావేశమయ్యారు. ఏం చర్చలు జరిపారన్నదానిపై క్లారిటీ లేదు.. కానీ గంటా ఇటీవలి కాలంలో ఉక్కు ఉద్యమమే సింగిల్ పాయింట్ ఎజెండాగా రాజకీయం చేస్తున్నారు. కేటీఆర్ కూడా ఎమ్మెల్సీఎన్నికల సమయంలో విశాఖ ఉక్కు ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించారు. అవసరం అయితే విశాఖ వెళ్లి ప్రత్యక్షంగా ఉద్యమంలో పాల్గొంటామని ప్రకటించారు.
అయితే కేటీఆర్ ఎన్నికల జిమ్మిక్ చేశారన్న విమర్శలు వచ్చాయి. కేటీఆర్ ఏ అవసరంతో అన్నా..అప్పట్లో గంటా స్వాగతించారు కానీ.. ఇంకా ఉద్యమ కార్యాచరణ పై చర్చిద్దామని.. ఆయన వద్దకు వెళ్లలేదు. ఇప్పుడు ఎన్నికలు ముగిశారు. హైదరాబాద్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ.. ఆశల్లేని స్థితి నుంచి టీఆర్ఎస్ విజయం దిశగా వెళ్తోంది. ఇప్పుడు.. గంటా వెంటనే రంగంలోకి దిగారు. కేటీఆర్ మద్దతుతో… ఉద్యమానికి మరో రూపం ఇచ్చేందుకు ఆయన సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది. స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం ఏ మాత్రం వెనక్కి తగ్గే ఉద్దేశంలో లేదు. ఆ విషయం పార్లమెంట్ సాక్షిగా బయటపడుతూనే ఉంది. అయితే ఎన్నికలకు ముందు స్టాండ్ ఇప్పుడు.. కేటీఆర్ కొనసాగిస్తారా అన్నదే సందేహం.
ఎందుకంటే.. ఎన్నికల సమయంలో బీజేపీతోనే పోరాటం అన్నట్లుగా టీఆర్ఎస్ ప్రకటనలు చేయడం… తర్వాత రాజీ లేదు.. రణం లేదు.. అని ప్రకటనలు చేయడం కామన్ అయిపోయింది. పైగా ఇప్పుడు.. బీజేపీపై జాతీయ అంశాలపై పోరాడటం లేదు. వ్యవసాయ చట్టాలను వ్యతిరేకించి.. ఇప్పుడు జై కొట్టారు. ఎన్నికల కోసం స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడి ఉంటారు కానీ… అదే అంశంపై బీజేపీతో లడాయి పెట్టుకోవడానికి సిద్దంగా ఉంటారని ఎవరూ అనుకోవడం లేదు. అయితే గంటా మాత్రం … కేటీఆర్ స్టేట్ మెంట్ ను నమ్మి… విశాఖ ఉక్కు ఉద్యమానికి.. కేటీఆర్ సాయంతో మరింత బలం తీసుకువద్దామని ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. రాజకీయేతర జేఏసీ పెట్టి…ఉద్యమానికి నేతృత్వం వహించాలనుకుంటున్న గంటాకు… టీఆర్ఎస్ మద్దుతు సీరియస్‌గా ఉండేలా చూసుకున్నట్లయితే.. గొప్ప అచీవ్ మెంట్ సాధించినట్లే. అయితే.. అది సాధ్యమేనా అన్నది ప్రశ్న..!?