హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలో పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణిదేవి విజయం సాధించారు. వరంగల్ , నల్లగొండ, ఖమ్మం స్థానంలో పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయంపై పెద్దగా ఎవరూ అపనమ్మకం పెట్టుకోలేదు. అద్భుతం జరుగుతుందని ఆశించారు కానీ… అలాంటిదేమీ జరగలేదు. కానీ హైదరాబాద్ స్థానంలో మాత్రం అద్భుతమే జరిగింది. అది కేవలం కేసీఆర్ రాజకీయ వ్యూహాల ప్రకారమే జరిగింది. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ పట్టభద్రుల నియోజకవర్గంలో టీఆర్ఎస్ గెలుస్తుందని.. ఎవరూ అనుకోలేదు. ఓ రకంగా చెప్పాలంటే.. టీఆర్ఎస్ అధినేతకు కూడా నమ్మకం లేదు. అందుకే చివరి క్షణం వరకూ అభ్యర్థిని ఖరారు చేయలేదు. అభ్యర్థిని పెట్టి.. ఓడిపోతే… వచ్చే డ్యామేజ్ వేరు. అందుకే ప్రొ.నాగేశ్వర్‌కు మద్దతివ్వాలనుకుంటున్నట్లుగా లీకులు పంపారు.
అప్పటికే పల్లా పేరును ఖరారు చేసి బీఫాం కూడా ఇచ్చేశారు. ఆయన ప్రచారంలోకి దిగేశారు. హైదరాబాద్ అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో… ఇక వదిలేశారని అనుకున్నారు. కానీ నామినేషన్లు ముగియడానికి రెండు రోజుల ముందు కేసీఆర్ తన రాజకీయ చాణక్యాన్ని ప్రదర్శించారు. పీవీ కుమార్తెకు గెలుపు హామీ ఇచ్చి పోటీకి నిలబెట్టారు. అనుకున్నది అనుకున్నట్లుగా ప్రచారం చేశారు. సురభి వాణిదేవిని అభ్యర్థిగా నిలబెట్టడంతో బీజేపీ ఒక్క సారిగా షాక్ కు గురయ్యింది. దీనికి కారణం… హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో అత్యధిక పట్టభద్ర ఓటర్లు బ్రాహ్మణసామాజికవర్గం వారు. బీజేపీ అభ్యర్థి రామచంద్రరావు కూడా అదే సామాజికవర్గం. అందుకే తన గెలుపునకు ఢోకా ఉండదని ఆయన విశ్వాసం.
అయితే అదే సామాజికవర్గానికి చెందిన పీవీ కుమార్తెను రంగంలోకి దించడం… ప్రధాని స్థాయిలో పని చేసిన ఆయన కుమార్తెకు ఓటు వేయకుండా ఆ సామాజికవర్గం ఎలా ఉంటుదనే ఆలోచన రావడంతో.. బీజేపీకి కూడా చెమటలు పట్టాయి. అందుకే ఎప్పుడూ లేని విధంగా బహిరంగంగా బ్రాహ్మణ కార్డును ఉపయోగించారు. పీవీ కుమార్తెను నిలబెట్టినా.. బ్రాహ్మణ ఓట్లన్నీ తనకే పడతాయని ప్రచారం చేసుకున్నారు. కొంత వరకూ పడ్డాయేమో కానీ… పూర్తి స్థాయిలో పడలేదు. ఫలితాలు చూసి.. బీజేపీ నేతలకు మైండ్ బ్లాంక్ అయింది. కేసీఆర్ రాజకీయ వ్యూహాల ముందు సరి తూగలేమని వారికి తేలిపోయింది.
పట్టభద్రులు… తెలంగాణ సర్కార్ పైఆగ్రహంతో ఉన్నారు. తెలంగాణ వచ్చినప్పటి నుండి అదే పరిస్థితి. పట్టభద్రుల ఎన్నికల్లో టీఆర్ఎస్కు ఎప్పుడూఎదురు దెబ్బలు తలుగుతూనే ఉన్నాయి. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో … కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి గెలిచారు. గతంలో రామచంద్రరావు గెలిచారు. పల్లా ఒక్కరు మాత్రం గతంలో గెలిచారు. ఇప్పుడు.. అది కూడా పోతుందేమో అన్నతంగా ప్రచారం జరిగింది. కేసీఆర్… ప్రగతిభవన్ దాటకుండా… రాజకీయ పరిస్థితులు తన చేయి దాటకుండా… చూసుకున్నారు. అందుకే దటీజ్ కేసీఆర్ అంటున్నారు.