ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ వారాంతపు ఆర్టికల్‌లో జగన్ గురించి ఏదైనా పెద్ద డెవలప్మెంట్ గురించి రాయాల్సి వస్తే.. ఇటీవలి కాలంలో పురాణాలు..సినిమాల్లో సీన్లను ఉదహరించి .. కాస్త సెటైరిక్‌గా చెప్పడం ప్రారంభించారు. తాజాగా చంద్రబాబుపై నమోదు చేసిన కేసు విషయంలోనూ ఆయన అదే స్టైల్ అనుసరించారు. జగన్ హిట్ లిస్ట్‌లో ఉన్న వారందరూ… జైలుకెళ్తే తప్ప.. ఆయన ప్రజలపై … పరిపాలనపై దృష్టి సారించలేరని.. మనశ్మాంతిగా ఉండలేరని.. ఆ అంశంపై…. ఆయన హిట్ లిస్ట్‌లో ఉన్న వారు .. అంటే చంద్రబాబు సహా అందరూ ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. లేకపోతే.. సీఐడీ పోలీసులు తలాతోక లేని కేసులు పెడుతూనే ఉంటారని.. వాటిని కోర్టులు ఆపుతూనే ఉంటాయన్నారు. దీంతో జగన్ రెడ్డికి మనశ్మాంతి కరువవుతుందని.. ఆ దెబ్బతో పోలీసుల్ని మరింత తిక్కగా వాడుకుంటారనేది ఆయన ఊవాచ. జరుగుతున్న పరిణామాలకు ఆర్కే తనదైన శైలిలో అలా పరిష్కారం చూపారన్నమాట.
మున్సిపల్ ఎన్నికల ఫలితాలపైనా ఆర్కే విశ్లేషించారు. అధికార పార్టీకి భయపడిప్రజలు ఓట్లేశారని ఆయన తేల్చారు. దానికి జగన్మోహన్ రెడ్డి నంద్యాల ఉపఎన్నికల తర్వాత చెప్పిన మాటలనే ఉదహరించారు. అయితే అదే సమయంలో ఎందుకు భయపడాలి అని టీడీపీ నేతలనూ విమర్శించారు. గుంటూరు కార్పొరేషన్ లాంటి చోట్ల లోపాయికారీ ఒప్పందాలు చేసుకుని పార్టీని భ్రష్టు పట్టించారని ఆయన తేల్చేశారు. విశాఖలో ప్రజలు ఓట్లేయడానికి సిద్ధంగా ఉన్నా… పార్టీ నాయకులే వేయించుకోలేకపోయారని అన్నారు. టీడీపీ నేతల తీరును ఆర్కే తన కొత్త పలుకులో బహిరంగంగానే విమర్శించారు. చంద్రబాబు కూడా… అండగా ఉంటారన్న నమ్మకాన్ని పార్టీ నేతలకు ఇవ్వలేకపోయారని ఆయన తేల్చేశారు. దానికి ఆయన వైఎస్‌తో పోల్చారు. చంద్రబాబు పాత కాలం రాజకీయం చేస్తున్నారని ఆక్షేపించారు.
అన్నీ చేసినా చివరికి ఆర్కే ఇచ్చిన సలహా ఎన్నికల్లో పోటీ చేయకపోవడం. తమిళనాడు తరహా రాజకీయాలు ఏపీలో సాగుతున్నాయి కాబట్టి అక్కడి తరహాలోనే… అంటే.. అప్పట్లో జయలలిత … ప్రతిపక్షంలో ఉన్నప్పుడు… స్థానిక సంస్థల ఎన్నికలతోపాటు ఉపఎన్నికల్లోనూ పోటీ చేసేవారు కాదేన విషయాన్ని ఆర్కే గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు కూడా అదే చేయమని పరోక్షంగా సలహా పంపిస్తున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పోటీ చేయవద్దని ఆయన నేరుగానే చెప్పారు. ఆయనే కాదు… జేసీ లాంటి వారు కూడా చెప్పారు. అయితే చంద్రబాబు అలాంటి వాటిని నమ్మలేదు. ఇప్పుడు తిరుపతి ఉపఎన్నిక విషయంలో కూడా నమ్మకపోవచ్చు. ఎందుకంటే టీడీపీ నేతల్ని ఇప్పటికే ఆయన ప్రజాక్షేత్రంలోకి పంపేశారు.