తెలంగాణ రాష్ట్ర సమితికి తామే ప్రత్యామ్నాయం అని ఇప్పటి వరకూ ఎలుగెత్తి చాటుతున్న భారతీయ జనతా పార్టీ నేతలకు ఎమ్మెల్సీ ఎన్నికలు గట్టి షాక్ ఇచ్చాయి. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికలతో వచ్చిన హైప్ అంతా.. ఎమ్మెల్సీ సిట్టింగ్ సీటును కోల్పోవడం… నల్లగొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడో నాలుగో స్థానంలో ఉండిపోవడంతో చల్లబడిపోయినట్లయింది. ఇప్పుడు సాగర్ ఉపఎన్నిక ద్వారా.. మళ్లీ బీజేపీ తనను తాను మరోసారి ప్రొజెక్ట్ చేసుకోవాల్సి ఉంది. ఓ రకంగా సాగర్ ఉపఎన్నికలు బీజేపీకి అసలైన లిట్మస్ టెస్ట్. అక్కడ ప్రభావం చూపిస్తే.. పెద్ద ఎత్తున మళ్లీ ప్రత్యామ్నాయం అనే ప్రచారం లభిస్తుంది. లేకపోతే.. ఏమీ ఉండదు.
సాగర్లో బీజేపీకి ఎలాంటి ఓటు బ్యాంక్ లేదు. తెలంగాణ ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో రెండు వేల చిల్లర ఓట్లు మాత్రమే ఆ పార్టీకి లభించాయి. ఇప్పుడు ఆ స్థాయి నుంచి విజేతగా మారితే… గొపప విజయం సాధించినట్లే అవుతుంది. బీజపీకి తిరుగులేకుండా చేసేలా.. మళ్లీ ఇమేజ్ పెరుగుతుంది. లేకపోతే… మొదటికే మోసం వస్తుంది. బీజేపీది అంతా వాపేనని.. ఆ పార్టీ నేతలు గాలి వాటానికి వచ్చిన విజయాలతో రెచ్చిపోయారన్న విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇప్పుడు… బీజేపీకి అసలైన టాస్క్ ఉంది. బీజేపీని బలహీనపర్చడానికి… ఆ పార్టీకి ప్రజల్లో ఆదరణ పెరగలేదని చెప్పడానికి… ప్రత్యామ్నాయంగా బీజేపీని ప్రజలు చూడటం లేదని చెప్పడానికి.. కేసీఆర్.. తనదైన వ్యూహాలు సిద్ధం చేస్తారు.
వీటిని ఎదుర్కోవడానికి బీజేపీ నేతలు సిద్ధం కావాల్సి ఉంది. కేసీఆర్ సాగర్ ఉపఎన్నికలోనే… వాటిని అమలు చేస్తారు. వాటిని ఇప్పుడు బీజేపీ నేతలు ఎదుర్కోవాలి. ప్రస్తుతానికి అయితే సాగర్ లో ప్రధానమైన పోటీ కాంగ్రెస్, టీఆర్ఎస్ మధ్య ఉంది. ఇదే పరిస్థితి ముందు ముందు కొనసాగించడానికి రెండుపార్టీలు ప్రయత్నిస్తాయి. గతంలోలా… కాంగ్రెస్ సీన్లోకి రాకుండా బీజేపీ ఎంటరయితే… సీన్ మారొచ్చు. అప్పుడే భారతీయ జనతా పార్టీ కాస్త ముందుకొస్తుంది. లేకపోతే.. మళ్లీ రాజకీయం మారిపోతుంది. కాంగ్రెస్ వర్సెస్ టీఆర్ఎస్ అన్నట్లుగా పరిస్థితి మారుతుంది. అప్పుడు బీజేపీ హైప్ అంతా కరిగిపోయినట్లవుతుంది.