ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక మొత్తాన్ని ప్రైవేటు పరం చేశారు. రెండేళ్లకు దాదాపు పదిహేను వందల కోట్లకు అమ్మేశారు. ఇసుక మొత్తాన్ని జయప్రకాష్ పవర్ వెంచర్స్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ సంస్థకు గతంలో ఇసుక తవ్విన అనుభవం లేదు. హిమాచల్ ప్రదేశ్‌లో పవర్ ప్లాంట్లు పెట్టిందో.. .పెట్టాలని అనుకుందో కూడా తెలియదు. కానీ వ్యాపార గుణం మాత్రం..ఇసుక తవ్వకాలు కాదు. అయినా ఆ సంస్థ టెండర్ వేసింది. దక్కించుకుంది. ఇందులో అందరూ ఉత్తరాది చెందిన డైరక్టర్లే ఉన్నప్పటికీ.. ఒక్కరు మాత్రం రాంకీ సంస్థతో అనుబంధం ఉన్న వ్యక్తి.. రాంకీకి సంబంధించిన ప్రతీ కంపెనీలోనూ డైరక్టర్‌గా ఉన్నారు. ఆయన పేరు పెద్దిబొట్ల గంగాధరశాస్త్రి. ఈ గంగాధర శాస్త్రి జయప్రకాష్ పవర్ వెంచర్స్‌లోనూ డైరక్టర్‌గా ఉన్నారు.
దీంతో ఇసుక బిజినెస్‌తో ఎలాంటి సంబంధం లేని జయప్రకాష్ పవర్.. ఏపీలో ఇసుకపై కన్నేయడానికి ప్రత్యేకమైన కారణం ఉందని వెల్లడయింది. ఈ రాంకీ సంస్థ ఎవరిదో కాదు… వైసీపీ ఎంపీ ఆళ్ల అయోధ్యరామిరెడ్డిది. చంద్రబాబుపై ధర్డ్ పార్టీ కేసులు పెట్టడంలో ఎప్పుడూ ముందుండే ఆళ్ల రామకృష్ణారెడ్డికి ఆయన సోదరుడు. మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి బావ. ఇలా చెప్పుకుంటూ పోతే.. రాంకీ గ్రూప్‌తో ప్రభుత్వాధినేతలకు ఉన్న సత్సంబంధాలు కూడా బయటకు వస్తాయి. అక్రమాస్తుల కేసుల్లో రాంకీ గ్రూప్‌పై కూడా.. అభియోగాలు ఉన్నాయి. అయోధ్య రామిరెడ్డికూడా నిందితుడే. అందుకే.. ఇసుకను కూడా… మొత్తంగా గుప్పిట్లో పెట్టుకున్నారా.. అన్న అనుమానాలు రావడానికి కారణం అయింది.
అసలు… ఇసుకను ప్రైవేటుకు ధారదత్తం చేయడం అన్న ఆలోచనే చాలా మందిని ఆశ్చర్య పరిచింది. ఇలా చేయడానికే ప్రజలకు పెద్దగాఇసుక దొరక్కుండా చేశారన్న అనుమానాలు కూడా విపక్షాలు వ్యక్తం చేశాయి ఇప్పుడు… ప్రజలకు కావాల్సినట్లుగా ఇసుక దొరకాలంటే ప్రైవేటుకు ఇవ్వాల్సిందేనన్నట్లుగా సీన్ మార్చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పుడు ఆన్ లైన్ బుకింగ్‌లు ఉండవు. నేరుగా ప్రైవేటు సంస్థ వద్దకు వెళ్లి వారు చెప్పినంత ఇచ్చి కొనుక్కెళ్లడమే. ధర ప్రభుత్వం నిర్ణయిస్తుందని చెబుతున్నారు కానీ… అస్మదీయులకే కాంట్రాక్ట్ దక్కినప్పుడు.. వారు అడిగేదే ధర అవుతుంది. అధికారిక ధర ఎంత ఉన్నా సరే.. !