రాజ్‌భవన్ కు… తాను రాసిన అత్యంత గోప్యంగా ఉంచాల్సిన లేఖలు లీకయ్యాయని ఎస్ఈసీ రమేష్ కుమార్ సీబీఐ విచారణ కోరుతూ హైకోర్టులో పిటిషన్ వేయడం సంచలనాత్మకం అయింది. ఆయన ఎన్నికల ప్రక్రియలో వ్యవహారాలను మొత్తం గవర్నర్‌కు నివేదించాల్సి ఉంటుంది. ఇలా నివేదిస్తున్న సమయంలో… జరుగుతున్న పరిణామాలపై ఆయన రాసిన లేఖలు… గవర్నర్‌కు పంపిన సమయంలో… ఆయన కంటే ముందుగానో… ఆయన చూసిన తరవాతనో కానీ లీకయ్యాయి. అవి సాదాసీదా వ్యక్తులకు లీక్ కాలేదు. ప్రభుత్వంలోని కీలక వ్యక్తులకే లీకయ్యాయి. సమాచారం మాత్రమే కాదు.. ఆ లేఖల కాపీలు కూడా వారికి చేరాయి. ఆ ప్రకారమే.. వారు నిమ్మగడ్డపై ప్రివిలేజ్ నోటీసులు ఇచ్చారు.
అంతే కాదు .. సోషల్ మీడియాలోనూ పోస్ట్ చేశారు. వాటిని తాము అధికారికంగా ప్రభుత్వానికి పంపామని గవర్నర్ కార్యాలయం ప్రకటించలేదు. అంటే అవి ఖచ్చితంగా గవర్నర్ కార్యాలయం నుంచి లీకైనట్లుగా భావించాలి. ఇది అధికార రహస్యాలను బహిర్గతం చేయడం లాంటిదే. ఇలాంటివి చేయడం.. రాజ్‌భవన్ ప్రతిష్టకే మచ్చ. ఇలాంటి పనులు ఎవరు చేసినా.. చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తే… అది మరింత మందికి ప్రేరణ అయ్యే అవకాశం ఉంటుంది. గవర్నర్ తరపున సాంకేతిక విషయాలన్నీ ఆయన కార్యదర్శినే చూస్తారు. లేఖలు కూడా ముందుగా ఆయనకే అందుతాయి. ఆయన చూసి.. వివరాలు గవర్నర్‌కు చెబుతారు. ఇక్కడ కార్యదర్శి గవర్నర్ కంటే ముందే.. ప్రభుత్వానికి సమాచారం ఇచ్చారని తాజా పిటిషన్లో స్పష్టమవుతుందని అంటున్నారు.
ఇది రాజ్‌భవన్‌ను అగౌరవపర్చడమే అవుతుంది. హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశిస్తే.. అంత కంటే అవమానం మరొకటి ఉండదు. అందుకే ఈ కేసు అత్యంత ఆసక్తికరంగా మారింది. ఒక వేళ విచారణకు ఆదేశించకపోతే.. ఎస్ఈసీ ఆందోళనలను కోర్టు పట్టించుకోనట్లు అవుతుంది. ఒక వేళ రాష్ట్ర పోలీసుల విచారణకు ఆదేశించినా .. అది మరిన్ని వివాదాలకు కారణం అవుతుంది. ఎలా అవుతందో.. తన పిటిషన్లోనే నిమ్మగడ్డ చెప్పారు. ఇప్పుడీ సమస్యకు పరిష్కారం.. రాజ్యాంగ వ్యవస్థల గౌరవం కాపాడాల్సిన బాధ్యత రాజ్‌భవన్ పైనే పడిందన్న చర్చ జరుగుతోంది. లీకు వీరుల్ని గుర్తించి… అధికార రహస్యాల లీకేజీ కింద కఠిన చర్యలు తీసుకోవడం చేయకపోతే.. రాజ్‌భవన్ ప్రతిష్ట మరింత మసకబారే అవకాశం ఉందని భావిస్తారు. అంతే కాదు.. అంతా తెలిసి కూడా గవర్నర్ మౌనంగా ఉంటే.. .. ఆయనపైనా రకరకాల ప్రచారాలు జరుగుతాయి. ఈ కేసులో ఇప్పుడు గవర్నర్ ఏం చేస్తారనేది కీలకంగా మారిందని అంటున్నారు.