ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్… రేషన్ కార్డులు ఉన్న వారికి ఇంటికే డోర్ డెలివరీ చేస్తామని ప్రకటించారు. ఆయనకు ఎన్నికల్లేకపోయినా హామీ ఇచ్చి… పథకాన్ని ప్రారంభించేశారు. అయితే కేంద్రం అడ్డు పడింది. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా.. తాము ఇస్తున్న బియ్యాన్ని .. డోర్ డెలివరీ చేయడానికి లేదని… ఢిల్లీ సర్కార్ సొంతంగా ఇవ్వదల్చుకుంటే… కొనుగోలు చేసి.. ఇచ్చుకోవాలని ఆదేశించింది. కేంద్రం ఆదేశాలపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మండిపడ్డారు. ఏపీని ఉదాహరణగా చూపిస్తూ కేంద్రానికి ఘాటులేఖ రాశారు. ఏపీలో రేషన్ డోర్ డెలివరీ చేస్తున్నారని.. అదీ కూడా ప్రజాపంపిణీ వ్యవస్థ కింద మాత్రమే పంపిణీ చేస్తున్నారని.. అక్కడ లేని అభ్యంతరం ఢిల్లీకి ఎందుకని ఆయన అందులో ప్రధానంగా ప్రస్తావించారు. దీంతో కేంద్రం తమతో అనుకూలంగా ఉండేవారు.. తమతో వ్యతిరేకంగా ఉండేవారితో అనుసరిస్తున్న వైఖరి మరోసారి చర్చనీయాంశం అయింది.
ఇంటికే రేషన్ పంపిణీ అనేది ఏపీలో ఫెయిల్డ్ కాన్సెప్ట్‌గా మిగిలింది. అయితే ఎన్నికల్లో అదో ఆకర్షణీయ హామీగా మారింది. ఇటీవలే ఏపీలో ఈ స్కీమ్ ప్రారంభించారు. పెద్ద ఎత్తున వాహనాలు కొనుగోలు చేసి.. డ్రైవర్లకు రూ. ఇరవై వేలకుపైగా జీతం ఇస్తూ… పథకాన్ని ప్రారంభించారు. మొదటి ఫీడ్ బ్యాక్ ఘోరంగా ఉంది. మొదట్లోనే చాలా మంది డ్రైవర్లు పంపిణీని నిలిపివేయడంతో జీతాలు పెంచాల్సి వచ్చింది. ఈ బాధలు ఆయా రాష్ట్రాలకు తెలుసో లేదో.. లేకపోతే.. వేరే వ్యవస్థ ద్వారా పంపిణీ చేయాలనుకుంటున్నారో కానీ… ఢిల్లీ అమలు కోసం సన్నాహాలు చేస్తోంది. తమిళనాడుతో పాటు బెంగాల్లోనూ పలు రాష్ట్రాల్లో వివిధ పార్టీలు ఈ హామీలు ఇచ్చాయి. ఇంటికే రేషన్ తెచ్చి ఇస్తామంటున్నాయి. దీంతో బీజేపీకి … కేంద్రం ఇచ్చే బియ్యాన్ని రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు.. పార్టీలు తాము సొంతంగా ఇస్తున్నట్లుగా ..డోర్ డెలివరీ చేసి ప్రచారం చేసుకుంటున్నాయని కోపం వచ్చినట్లుగా ఉంది. వెంటనే ఢిల్లీ సర్కార్ ప్రయత్నాలకు అడ్డు పుల్ల వేసే ప్రయత్నం చేసింది.
ఇష్టమైనవాడు పిత్తినా సువాసనే అని నాటు సామెత ఒకటి ఉంది. ఇది రేషన్ డోర్ డెలివరి నిబంధనల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న తీరుకు సరిగ్గా సరిపోయేలా ఉంది. మిత్రపక్షం కాకపోయినా.. ఎన్డీఏలో భాగస్వామి కాకపోయినా… వైసీపీ కేంద్ర పథకాలను తమ పథకాలుగా ప్రచారం చేసుకుంటున్నా.. అటు ఢిల్లీ నేతలు కానీ ఇటు ఏపీ బీజేపీ నేతలు కానీ నోరు మెదపరు. కానీ ఏపీ లాంటి పథకాలే ఇతర రాష్ట్రాల్లో అదీ కేంద్రం నిధులతోనే.. కేంద్రం ఇచ్చే బియ్యంతోనో అమలు చేస్తామంటే మాత్రం.. రూల్స్ బుక్ పట్టుకుని ముందుకు వచ్చేస్తారు. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తోంది.