కేంద్రం ప్రకటించిన 67వ జాతీయ అవార్డులలో దక్షిణాది చిత్రాలు హవా చూపించాయి. సింహ భాగం అవార్డులు దక్షిణాదికే దక్కాయి. స్వతహాగా మలయాళ చిత్రాల ప్రభావం జాతీయ అవార్డుల్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఈసారి తమిళ, తెలుగు చిత్రాలూ… తమ ప్రతాపం చూపించాయి. ఈసారి తెలుగు సినిమాలకు ఏకంగా 4 అవార్డులు దక్కడం విశేషం. అందులో జెర్సీ, మహర్షి చిత్రాలు చెరో రెండు అవార్డులు పంచుకున్నాయి. ఉత్తమ తెలుగు చిత్రం (జెర్సీ), ఉత్తమ ఎడిటర్ (నవీన్ నూలి -జెర్సీ), ఉత్తమ కొరియోగ్రఫీ (రాజు సుందరం – మహర్షి), ఉత్తమ వినోదాత్మక చిత్రం (మహర్షి)… జాతీయ అవార్డులలో స్థానం దక్కించుకున్నాయి.
ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా ఏదో ఓ తెలుగు సినిమాకి అవార్డు లభిస్తుంది. అది కామనే. కానీ విమర్శకుల మన్ననలతో పాటు, బాక్సాఫీసు వసూళ్లని అందుకున్న జెర్సీకి ఆ స్థానం దక్కడం – తెలుగు చిత్రసీమకు మరింత సంతృప్తిని ఇచ్చింది. సాంకేతికంగా తెలుగు సినిమా ఈమధ్య ఎదిగింది. ఇంకా ఎదుగుతోంది కూడా. జెర్సీకి ఉత్తమ ఎడిటర్ గా.. నవీన్ నూలి.. ఎంపికవ్వడం అందుకు మరో నిదర్శనం. జెర్సీ క్రికెట్ నేపథ్యంలో సాగే కథ. అలాంటి సినిమాకి కత్తెర వేయడం ఆషామాషీ వ్యవహారం కాదు. సినిమా చూస్తున్నంత సేపూ.. ఓ అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ చూస్తున్న ఫీలింగ్ రావడం… నవీన్ నూలి ప్రతిభకు తార్కాణం. అదే జ్యూరీ మనసుల్ని గెలుచుకుని ఉంటుంది. రైతు నేపథ్యంలో సాగిన కథ.. మహర్షి. ఓ స్టార్ తో ఇలాంటి కథ డీల్ చేయడం మామూలు విషయం కాదు. ఆ విషయంలో వంశీ పైడిపల్లి సక్సెస్ అయ్యాడు. అందుకే… ఉత్తమ వినోదాత్మక చిత్రం జాబితాలో మహర్షికి చోటు దక్కింది.
ఉత్తమ నటుడి విభాగంలో.. ధనుష్ మరోసారి జాతీయ అవార్డు జ్యూరీ మనసుల్ని గెలుచుకున్నాడు. అసురన్లో తన అపూర్వమైన నటనకు గానూ.. అ అవార్డు దక్కింది. అసురన్ వచ్చినప్పుడే ఈసారి జాతీయ అవార్డులలో ధనుష్ పేరు కనిపిస్తుందనుకున్నారంతా. ఆ మాటే నిజం అయ్యింది. విజయ్ సేతుపతి ఉత్తమ సహాయ నటుడిగా తన ప్రతాపం చూపించాడు. సూపర్ డీలక్స్ చిత్రానికి గానూ… తనకు ఈపురస్కారం దక్కింది. నిజంగా అలాంటి పాత్ర చేయడం. ఓ సాహసం. తనకు మాత్రమే సాధ్యం అనిపించేలా నటించాడు. సూపర్ డీలక్స్కి మరిన్ని అవార్డులు దక్కుతాయని తమిళ జనాలు భావించారు. కానీ.. ఆ ఒక్క అవార్డుతో సరిపెట్టాల్సివచ్చింది. ఉత్తమ చిత్రం (అసురన్), ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ చిత్రం (మరక్కర్ – మలయాళం), ఉత్తమ సంగీత దర్శకుడు (ఇమ్మాన్ – తమిళం) ఇవన్నీ దక్షిణాదికి దక్కిన గౌరవాలే.