ఈసారి జాతీయ అవార్డుల్లో తెలుగు సినిమా హవా చూపించింది. తెలుగుకి 4 అవార్డులు దక్కాయి. అందులో మహర్షి ఖాతాలో 2 పడ్డాయి. ఉత్తమ వినోదాత్మక చిత్రంగా మహర్షి నిలిచింది. కొరియోగ్రఫీకి గానూ.. రాజు సుందరం పురస్కారం అందుకోనున్నాడు.
నిజానికి కొరియోగ్రఫీ అంటే.. అదిరిపోయే స్టెప్పులు, వింత వింత విన్యాసాలూ అనుకుంటారు. కానీ ఈసారి మహర్షికి ఈ విభాగంలో దక్కిన అవార్డు చూస్తే కొరియోగ్రఫీకి కొత్త అర్థం ఇచ్చినట్టైంది. ఈ సినిమాలో మహేష్ ఏమీ అదిరిపోయే స్టెప్పులు వేయలేదు. కానీ.. ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు రాజు సుందరంకి దక్కింది. దానికి కారణం. రాజు సుందరం కథని అర్థం చేసుకున్న విధానం. మహర్షిలో 3 మాంటేజ్ గీతాలున్నాయి. `చోటి ఛోటి బాతే`, `ఇదే కదా..`, `పదర పదర`.. ఇవన్నీ మాంటేజ్ గీతాలే. మంచి మాస్ బీట్ ఉన్న పాటలకు ఎవరైనా స్టెప్పులు కంపోజ్ చేస్తారు. మాంటేజ్ పాటల్లోనే దర్శకుడు, కొరియోగ్రాఫర్ల పనితనం బయటకు వస్తుంది. పాటలోని ఎమోషన్ ని అర్థం చేసుకుని మాంటేజ్లను కంపోజ్ చేయాలి. `పదర పదరా`, `ఇదే కదా..` పాటల్లో మంచి మాంటేజ్ లు ఇవ్వగలిగాడు రాజు సుందరం. కథతో పాటు పాటలోకి ప్రయాణం చేసి, పాటలోనే కథ చెప్పాడు. ఆయా గీతాలు సినిమాలోని ఎమోషన్ ని పండించడానికి బాగా దోహదం చేశాయి. బహుశా ఆ కారణంతోనే రాజు సుందరంకి అవార్డు దక్కి ఉండొచ్చు. మహేష్‌కి ఆల్ టైమ్ ఫేవరెట్ డాన్స్ మాస్టర్ రాజు సుందరం. మహేష్ బాడీ లాంగ్వేజ్ ఎలాంటిదో, తనకు ఎలాంటి స్టెప్పులు బాగా సూటవుతాయో… రాజు సుందరంకి బాగా తెలుసు. అందుకే ప్రతీ సినిమాలోనూ… తనతోనే పాటలు కంపోజ్ చేయించుకుంటాడు. దాదాపు అన్ని సినిమాలకూ సింగిల్ కార్డే. ఇప్పుడు అదే మహేష్ సినిమాతో రాజు సుందరంకి అవార్డు దక్కడం.. కాకతాళీయం.