జాతీయ అవార్డులు వచ్చేశాయ్. మంచి సినిమాలకు, కష్టానికీ గుర్తింపు లభించింది. మరి.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నంది – సింహాల మాటేమిటి? అసలు ఈ అవార్డులు ఉన్నాయా, పక్కన పెట్టేశారా? గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం… ఉగాది నాటికి తుచ తప్పకుండా నంది పురస్కారాల్ని అందించేది. అప్పుడప్పుడూ కాస్త అటూ ఇటూ అయ్యేది. ఇప్పుడు ఏళ్ల తరబడి – నంది అవార్డుల ప్రకటన, ప్రదానం వాయిదా వేస్తూనే ఉన్నారు. `సింహా` అవార్డులు ఇస్తాం.. అని తెలంగాణ ప్రభుత్వం చెప్పినా.. ఒక్కసారి కూడా అవి ఇచ్చిన పాపాన పోలేదు.
సినీ రంగానికి ప్రధమ తాంబూలం ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వాలు చెప్పడమే గానీ, వాటిని పట్టించుకోలేదు. సినిమా వాళ్లు ఎప్పుడెళ్లి కలిసినా `అదిగో – ఇదిగో` అనడం తప్ప కార్యరంగంలోకి దిగలేదు. అసలు ఈ అవార్డులు ఇచ్చే ఉద్దేశ్యాలు ప్రభుత్వాలకు ఉన్నాయా, లేదా? లేదంటే మొత్తానికి ఎత్తేశారా? అనే విషయంపై ఎలాంటి స్పష్టతా లేదు. పోనీ.. ఇదేమైనా కోట్లతో ముడిపడిన వ్యవహారాలా.. అంటే అదీ లేదు. అవార్డు ప్రకటనకూ, ప్రదానాలకూ పెద్దగా ఖర్చేం ఉండదు కూడా. ఎప్పుడో నాలుగేళ్ల క్రితం విడుదలైన సినిమాలకు ఇప్పుడు అవార్డులు ఇవ్వడంలో అర్థం ఉండదు. నాలుగైదేళ్ల సినిమాలకు ఒకేసారి అవార్డులు కట్టకట్టుకుని ఇచ్చేయడంలో.. కిక్కూ రాదు. జాతీయ అవార్డుల్లానే.. ప్రతీ యేటా క్రమం తప్పకుండా ఇవ్వగలిగితేనే విలువ ఉంటుంది. ప్రతీ రాష్ట్రానికీ ఓ సాంస్క్కృతిక వ్యవహారాల శాఖ అంటూ ఒకటి ఉంది. సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖా ఉంది. ఇవి ఏం చేస్తున్నట్టు? ఓ కమిటీని వేసి, అవార్డుల్ని ఎంపిక చేయడం ఎంత పని? కానీ అటువైపుగా దృష్టి సారించరెందుకో? రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం చూసి చిత్రసీమకూ చిరాకు వేసినట్టుంది. నంది – సింహాల గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదు. ఇచ్చినా తీసుకునేందుకు ఇప్పుడు ఎవరూ.. సిద్ధంగా లేరేమో.,..?