నాగార్జున సాగర్‌లో బలమైన అభ్యర్థిని నిలబెట్టడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఎవరెవరి దగ్గరకో వెళ్తున్నాయి. ఇప్పుడు… ఎమ్మెల్సీ ఎన్నికల్లో నల్లగొండ స్థానం నుంచి పోటీ చేసి రెండో స్థానంలో నిలిచిన తీన్మార్ మల్లన్న అలియాస్ నవీన్ వద్దకు చేరింది. నవీన్ హఠాత్తుగా ఢిల్లీలో ప్రత్యక్షమవడంతో.. అందరూ బీజేపీ పెద్దలతో చర్చలకేనని అనుకుంటున్నారు. అయితే ఆయన మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. మరో వైపు.. సాగర్ ఉపఎన్నిక నోటిఫికేషన్ వచ్చేసింది. నామినేషన్లు కూడా మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. దీంతో అభ్యర్థిని ఖరారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బీజేపీ తరపున పోటికి రెడీగా ఉన్న వారు… బలవంతులు కాదని డిసైడయ్యారు. అందుకే.. వారెవరికీ టిక్కెట్ ఇవ్వదల్చుకోలేదు. కొత్త వారి కోసం చూస్తున్నారు.
టీఆర్ఎస్ టిక్కెట్ కోసం ప్రయత్నిస్తున్న వారిలో .. టిక్కెట్ ఖరారైన తర్వాత ఎవరైనా బీజేపీ వైపు రాకపోతారా అన్న ఆశలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రెడ్డి సామాజికవర్గానికి చెందిన చిన్నపరెడ్డి, కోటిరెడ్డి టిక్కెట్ పై ఆశలు పెట్టుకున్నారు. అయితే యాదవ సామాజికవర్గానికి అదీ కూడా.. నోముల తనయుడికే టిక్కెట్ ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లుగా ప్రచారం జరుగడంతో.. వారితో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. రెండో స్థానం సాధించిన తీన్మార్ మల్లన్నకు సోషల్ మీడియాలో క్రేజ్ రావడంతో… ఆయన వైపు కూడా చూస్తున్నారు. టీఆర్ఎస్ ఖరారు చేసిన తర్వాతనే అభ్యర్థిని ఖరారు చేయాలన్న ఆలోచన చేస్తున్నారు.
మొత్తంగా బీజేపీ..సొంత పార్టీలో ని అభ్యర్థుల్ని నమ్ముకోవడానికి సిద్ధంగా లేరు. టిక్కెట్ మాత్రం. చివరి క్షణంలో బయట నుంచి వచ్చే వారికే ఇవ్వనున్నారు. ఆ బయట వ్యక్తి ఎవరనేదే ఇప్పుడు సస్పెన్స్. టీఆర్ఎస్ నేత అవుతారా..లేకపోతే టీఆర్ఎస్‌ను చాలెంజ్ చేసిన తీన్మార్ మల్లన్న అవుతారా అన్నది ఇప్పుడు కీలకంగా మారింది. తీన్మార్ మల్లన్న సొంత పార్టీ ఆలోచనల్లో ఉన్నారన్న ప్రచారం కూడా గట్టిగా జరుగుతోంది.