ఆంధ్రకు ప్రత్యేకహోదా ఇవ్వబోమని మరోసారి కేంద్రం తేల్చేసింది. ఇరవై రెండు మంది లోక్‌సభ ఎంపీలు ఉన్న వైసీపీ… కేంద్రమంత్రి పార్లమెంట్ లో సమాధానం చెబుతున్నప్పుడు.. సైలెంట్‌గా ఉండిపోయింది. ఆ తర్వాత తమకు ప్యాకేజీ కూడా వద్దని మంత్రి మిధున్ రెడ్డి స్పష్టం చేశారు. అయితే ప్రత్యేకహోదా కావాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా అంశం పార్లమెంట్లో మరోసారి ప్రస్తావకు వచ్చింది. టీడీపీ ఎంపీ రామ్మోహన్ నాయుడు అడిగిన ప్రశ్నకు .. కేంద్రమంత్రి నిత్యానందరాయ్ సమావేశం ఇచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేశారు. 14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని ఆయన చెప్పుకొచ్చారు. అదే సమయంలో ఏపీకి ప్రత్యేక ప్యాకేజీతో పాటు అనేక మినహాయింపులు ఇచ్చామన్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వెళ్లిన ప్రతీ సారి ప్రత్యేకహోదా గురించి అడుగుతున్నారని… వైసీపీ నేతలు ప్రచారం చేస్తూంటారు. ఎక్కువ సందర్భాల్లో.. ముఖ్యంత్రి పర్యటనపై విడుదలయ్యే మీడియా సమాచారంలోనూ అదే వాక్యం ఉంటుంది. కానీ అడుగుతున్నారో లేదో మాత్రం ఎవరికీ తెలియదు. కొద్ది రోజుల కిందట.. జగన్ ఢిల్లీ పర్యటనలో అమిత్ షాతో భేటీ తర్వాత సవరించిన పోలవరం నిధులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరినట్లుగా ప్రకటించారు. అయితే అలాంటి విజ్ఞాపన ఏదీ రాలేదని తర్వాత కేంద్రం పార్లమెంట్‌లోనే స్పష్టం చేసింది. దీంతో… ప్రత్యేకహోదాను సైతం అదే మాదిరిగా అడుగుతున్నారేమోనన్న సందేహం ప్రజల్లో ప్రారంభమవుతోంది.
14వ ఆర్థిక సంఘం సిఫార్సులకు కాలం చెల్లింది. కొత్తగా పదిహేనో ఆర్థిక సంఘం నివేదిక అమల్లోకి వచ్చింది. అయినప్పటికీ.. కేంద్రం పాత సమాధానాల్నే చెబుతోంది. నిత్యానందరాయ్ ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చేది లేదని చెబుతున్నప్పుడు వైసీపీ ఎంపీలు ఎలాంటి నిరసన వ్యక్తం చేయలేదు. ఆ తర్వాత మాట్లాడిన మిధున్ రెడ్డి.. తమకు ప్రత్యేకహోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎంపీలను గెలిపిస్తే.. కేంద్రం మెడలు వంచి హోదా తీసుకు వస్తానని జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో చెప్పేవారు. ఇప్పుడు ఉభయసభల్లో ఇరవై ఎనిమిది మంది వరకూ ఎంపీలు ఉన్నా… వైసీపీ తరపున జరుగుతున్న పోరాటం లేదు.