రానా నటించిన పాన్ ఇండియా సినిమా `అరణ్య`. బాహుబలితో రానాకి బాలీవుడ్ లో మంచి మార్కెట్ ఏర్పడింది. దానికి తోడు… ఏనుగుల నేపథ్యంలో సినిమా కావడంతో.. బాలీవుడ్ లోనూ ఈ కథను విడుదల చేస్తున్నారు. మిగిలిన భాషల్లో `అరణ్య`గా, హిందీలో `హాథీ మేరీ సాథీ` పేరుతో ఈ శుక్రవారం విడుదల అవుతోంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో ఈ సినిమా విడుదల కావడం లేదు. మిగిలిన అన్ని భాషల్లో మాత్రం ఈనెల 26నే వస్తోంది. బాలీవుడ్ లో మాత్రం కోవిడ్ కారణంగా ఈ సినిమా విడుదలని వాయిదా వేస్తున్నామని చిత్రబృందం ప్రకటించింది. నార్త్ లో కోవిడ్ కేసులు పెరిగాయి. ముఖ్యంగా మహారాష్ట్రలో రోజు రోజుకీ కేసులు పెరుగుతున్నాయి. అక్కడ ప్రభుత్వ నిబంధనలు కఠినంగా ఉన్నాయి. చాలా ప్రాంతాల్లో థియేటర్లు తెరచుకోలేదు. రాత్రిపూట కర్ఫ్యూ కూడా కఠినంగా అమలు అవుతోంది. ఈ నేపథ్యంలో.. కొన్ని బాలీవుడ్ సినిమాలు విడుదలని వాయిదా వేసుకుంటున్నాయి. `హాథీ మేరీ సాథీ` కూడా ఈ కారణంతోనే బాలీవుడ్ లో విడుదల కావడం లేదు. పరిస్థితులు చక్కబడ్డాక… హిందీలో ఈసినిమాని విడుదల చేసే అవకాశం ఉంది.