ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్త ఎస్ఈసీ నియామకం కోసం ముగ్గురు రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల పేర్లను గవర్నర్కు పంపింది. ఆ పేర్లు చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు. ఎందుకంటే… వాటిలో జస్టిస్ కనగరాజ్ పేరు లేదు. ఆయన ఇప్పటికే ఓ సారి ఎస్ఈసీగా బాధ్యతలు చేపట్టి కోర్టు తీర్పు కారణంగా పదవి కోల్పోయారు. దీంతో నిమ్మగడ్డ పదవీ కాలం ముగిసిన తర్వాత ఆయనకు జగన్ న్యాయం చేస్తారని అనుకున్నారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఆయన పేరును అసలు పరిగణనలోకి తీసుకోవడం లేదు. ప్రభుత్వం శామ్యూల్ వైపు అధికంగా మొగ్గు చూపుతోంది.
నిమ్మగడ్డ రమేష్ కుమార్ను తొలగించడానికి ఆర్డినెన్స్ తెచ్చిన తర్వాత సీఎం జగన్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్ఈసీగా రిటైర్డ్ అధికారులను నియమిస్తే వారు అప్పటి వరకూ రాజకీయ నాయకుల దగ్గర పని చేసి ఉంటారు కాబట్టి వారి మాటలే వింటారని నీతి వాక్యాలు చెప్పారు. అందుకే మాజీ న్యాయమూర్తిని నియమిస్తున్నామని.. చెప్పుకొచ్చారు. ఇప్పుడు అలాంటి ప్రయత్నాలు సీఎం జగన్ ఎందుకు చేయడం లేదో ఎవరికీ అర్థం కావడం లేదు. ఆయన చెప్పిన నీతి సూత్రాలకు తగ్గట్లుగా మాజీ న్యాయమూర్తినే నియమించవచ్చు కదా.. నిన్నమొన్న పదవీ విరమణ చేసి.. తన అక్రమాస్తుల కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న వారు.. తన ప్రభుత్వ మాటలు విని కోర్టు ఆదేశాలను కూడా పట్టించుకోలేదని విమర్శలు ఎదుర్కొంటున్న వారిని ఎందుకు ఎస్ఈసీగా నియమించాలనుకుంటున్నారో ఇతర పార్టీల నేతలకు అర్థం కావడం లేదు.
సీఎం జగన్ నీతి వాక్యాలు చెప్పడానికి చాలా చెబుతారని.. కానీ అమలు చేయడానికి వచ్చే సరికి.. తాను చెప్పిన మాటల్ని తాను కనీసం గుర్తుంచుకోరన్న విమర్శలు ఇటీవలి కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి.చిన్న చిన్న అంశాల్లోనే కాదు…శాసనమండలి లాంటి పెద్ద అంశంలోనూ అదే పరిస్థితి. సాక్షాత్తూ శాసనసభలోనే మండలి గురించి ఆయన చెప్పిన మాటలు ఇప్పుడు తూచ్ అయ్యాయి. ఇప్పుడు మండలి గురించి గొప్పగా చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉంటారన్న విమర్శలు ఉన్నాయి. మొత్తానికి సీఎం జగన్ అవసరానికి తగ్గట్లుగా మాటలు మాట్లాడేస్తూ.. వారి పార్టీ వారిని అబ్బురపరుస్తూ ఉంటారు.. ఇతర పార్టీల నేతల్ని నోళ్లు నొక్కుకునేలా చేస్తూ ఉంటారు.