పరిషత్ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చినప్పటికీ.. మార్చి 31వ తేదీలోపు ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాదని అందుకే తాను నోటిఫికేషన్ ఇవ్వలదల్చుకోలేదని నిమ్మగడ్డ రమేష్ కుమార్ తేల్చి చెప్పేశారు. ఆయన హయాంలోనే ఎన్నికలు నిర్వహించాలని వారం రోజుల్లోనే ప్రక్రియ పూర్తి చేయవచ్చని ముఖ్యమంత్రి సహా పలువురు ప్రభుత్వంలోని పెద్దలు చెబుతున్న సమయంలో.. నిమ్మగడ్డ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. పరిషత్ ఎన్నికలు రాష్ట్రం మొత్తం ఒకే సారి నిర్వహించడం సాధ్యం కాదు. పంచాయతీ ఎన్నికలు నిర్వహించినట్లుగానే నాలుగు విడతలుగా నిర్వహించాలి. ఆలా చేయడానికి కనీసం ఒక్కో విడతకు ఐదుల గ్యాప్ ఇచ్చినప్పటికీ.. ఇరవై రోజుల సమయం పడుతుంది. అందుకే నిమ్మగడ్డ తన హయాంలో నిర్వహించడానికి సిద్ధంగా లేరు.
నిజానికి గతంలోనే ఆయన ఎన్నికలు నిర్వహించాలనుకున్నారు. కానీ… ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. ఏకగ్రీవాల విషయంలో… విచారణ నిర్వహించాలని నిమ్మగడ్డ ఆదేశించడం ప్రభుత్వానికి నచ్చలేదు. దాంతో కోర్టుకు వెళ్లి అనుకూల నిర్ణయం తెచ్చుకున్నారు. దాంతో సమయం గడిచిపోయింది. ఒక వేళ ప్రభుత్వం నిమ్మగడ్డ నిర్ణయంపై కోర్టుకు వెళ్లకపోతే.. ఈ పాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తయిపోయి ఉండేదే. అయిేత ఇప్పటికీ.. దౌర్జన్యాలు, బెదిరింపులు, ప్రలోభాల కారణంగా నామినేషన్లు వేయలేకపోయినవారు రిటర్నింగ్ అధికారులకు ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉందని.. నిమ్మగడ్డ స్పష్టం చేశారు.
ఎన్నికలు పెట్టాలని ప్రభుత్వం నిమ్మగడ్డను ఓ రకంగా బెదిరింపులకు గురి చేసింది. ఆయన సెలవు పెట్టబోతున్నారని తెలుసుకుని ప్రివిలేజ్ నోటీసు జారీ చేయించింది. అందుబాటులో ఉండాలని స్పష్టం చేసింది. అయితే నిమ్మగడ్డ మాత్రం.. రివర్స్‌లో తన లేఖల లీకేజీ అంశంపై హైకోర్టులో పిటిషన్ వేశారు. చివరికి ఆయన పదవి కాలం ముగిసిపోతోంది. ప్రభుత్వం కూడా ఇప్పుడు రియలైజ్ అవుతున్నట్లుగా ఉంది. కొత్త ఎస్ఈసీతోనే ఎన్నికలు నిర్వహించుకోవాలన్న ఆలోచనలో పడింది. క్షణం ఆలస్యం కాకుండా ఎస్ఈసీ నియామకానికి ఏర్పాట్లు చేసుకుంటోంది.