కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం పాఠశాలలకు బంద్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో త్వరలోనే థియేటర్లనూ మూసేస్తారని ప్రచారం మొదలైంది. కనీసం 50 శాతం ఆక్యుపెన్సీ అనే ఆంక్షలైనా తెరపైకి వస్తాయని చెప్పుకుంటున్నారు. దీనిపై తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ స్పందించారు. థియేటర్లని మూసేసేలా నిర్ణయమేదీ తీసుకోలేదని, అవన్నీ పుకార్లే అని వాటిని నమ్మొద్దని స్పష్టం చేశారు. కనోనా సమయంలో చిత్రసీమ బాగా నష్టపోయిందని, వాళ్ల అవసరాల్ని తెలుసుకుని, సమస్యలు తీర్చే విధంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని మంత్రి పేర్కొన్నారు. కోవిడ్ నిబంధనల్ని దృష్టిలో ఉంచుకుని థియేటర్లను నడుపుకోవొచ్చని సూచించారు. మంత్రి ప్రకటన తో చిత్రసీమ ఊపిరి పీల్చుకున్నట్టైంది. ప్రస్తుతానికైతే తెలంగాణ ప్రభుత్వానికి ఇలాంటి ఉద్దేశాలు లేవని స్పష్టమైంది. అయితే కేంద్ర ప్రభుత్వ సూచనల్ని అనుసరించి రాష్ట్రాలు నడుచుకోవాలి. థియేటర్ల నిర్వహణపై కేంద్రం ఏమైనా కఠిన నిర్ణయం తీసుకుంటే రాష్ట్రాలు కూడా ఏం చేయలేవు.