న్యాయమూర్తి ఎన్వీ రమణపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గత ఏడాది సెప్టెంబర్ ఆరో తేదీన చేసిన ఫిర్యాదును పూర్తి స్థాయిలో విచారణ జరిపి డిస్మిస్ చేసినట్లుగా సుప్రీంకోర్టు ప్రకటించింది. ఎన్వీ రమణను తదుపరి చీఫ్ జస్టిస్‌గా సిఫార్సు చేస్తూ.. ప్రస్తుత సీజేఐ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత జస్టిస్ ఎన్వీరమణపై గతలో ఏపీ సీఎం చేసిన ఆరోపణల గురించి వివరణ ఇచ్చారు. సీఎం జగన్మోహన్ రెడ్డి నుంచి ఆరోపణలతో లేఖ అందిన తర్వాత పూర్తి స్థాయిలో ఇన్ హౌస్ అంటే.. అంతర్గత విచారణ జరిపామని.. అందులోని అంశాలన్నీ అవాస్తవమని తేలడంతో డిస్మిస్ చేసినట్లుగా ప్రకటించారు.
సుప్రీంకోర్టు న్యాయమూర్తికి సంబంధించిన అంశం కావడంతో పూర్తిగా కాన్ఫిడెన్షియల్‌గా విచారణ జరిగిందని..ఇందులోని అంశాలు పబ్లిక్ కోసం అందుబాటులో ఉంచలేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే చీఫ్ జస్టిస్‌కు లేఖ రాసిన విషయం … వారం వరకూ ఎవరికీ తెలియదు. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డినే ప్రత్యేకంగా తన ప్రభుత్వ సలహాదారులతో ప్రెస్ మీట్ పెట్టించి ఆ లేఖను విడుదల చేయించి.. మీడియాలో విస్తృత ప్రచారం అయ్యేలా చేశారు. ఆ లేఖలో జస్టిస్ ఎన్వీ రమణతో పాటు అప్పటి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జేకే మహేశ్వరిపైనా ఆరోపణలు చేశారు. వాటన్నింటినీ సుప్రీంకోర్టు అంతర్గతంగా విచారణ జరిపింది.
అవన్నీ అవాస్తవాలు అని తేలడంతో ఆయనను తదుపరి సీజేఐకి సిఫార్సు చేయడానికి ఉన్న అడ్డంకులు కూడా తొలగిపోయాయి. అయితే సీఎం జగన్ ఆ లేఖను మీడియాకు విడుదల చేయడంపై … పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో పడ్డాయి. కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారని.. న్యాయ వ్యవస్థను బెదిరించడానికి ప్రయత్నించారన్న ఆరోపణలతో పిటిషన్లు వేశారు. కొన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు వివిధ కారణాలతో కొట్టి వేశారు. మరికొన్ని పిటిషన్లు పెండింగ్‌లో ఉన్నాయి.