ఈ యేడాది బాక్సాఫీసు దగ్గర జోరు ఎక్కువగానే కనిపిస్తోంది. ప్రతీవారం కనీసం మూడు నాలుగు సినిమాలు టంచనుగా వచ్చేస్తున్నాయి. ఈవారమూ అంతే. మూడు సినిమాలు పోటీ పడబోతున్నాయి. `రంగ్ దే`, `అరణ్య`, `తెల్లవారితే గురువారం`…. బాక్సాఫీసు దగ్గర ఢీ కొట్టబోతున్నాయి. నితిన్ – కీర్తి కాంబినేషన్ లో రూపొందిన చిత్రం `రంగ్ దే`. `తొలి ప్రేమ`లాంటి రొమాంటిక్ హిట్ ఇచ్చిన వెంకీ అట్లూరి దర్శకుడు. ప్రచార చిత్రాలు, పాటలూ బాగున్నాయి. దాంతో ఈసినిమాపై అంచనాలు పెరిగాయి. బాహుబలి తరవాత అంతగా కష్టపడిన సినిమా ఇదంటూ `అరణ్య` గురించి రానా గొప్పగా చెబుతున్నాడు. ఆ కష్టం టీజర్లు, ట్రైలర్లలో కనిపిస్తోంది. అటవీ నేపథ్యంలో సాగే కథ ఇది. థ్రిల్లింగ్ మూమెంట్స్ ఎక్కువగానే ఉన్నాయనిపిస్తోంది. ఓ సమాజిక ప్రయోజనంతో పాటు బలమైన కథ, కథనాలు ఉన్నాయని దర్శకుడు చెబుతున్నాడు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందిచన సినిమా ఇది. మరి బాక్సాఫీసు దగ్గర ఎలాంటి ఫలితాన్ని తీసుకొస్తుందో చూడాలి.
కీరవాణి తనయుడు సింహా కథానాయకుడిగా నటించిన సినిమా `తెల్లవారితే గురువారం`. ఇదో రొమాంటిక్ ఎంటర్టైనర్. ఈమధ్య చిన్న సినిమాలు బాక్సాఫీసుని గడగడలాడిస్తున్నాయి. ఏ సినిమాలో ఏ మహత్తు ఉందో చెప్పలేకపోతున్నారు. స్టార్లు లేకపోయినా – కాన్సెప్ట్ బాగుంటే, జనాలు థియేటర్లకు ఎగబడుతున్నారు. కాస్త పాజిటీవ్ టాక్ వచ్చినా, ఈ సినిమాకి మంచి వసూళ్లు దక్కే అవకాశం ఉంది. రాజమౌళి లాంటి వాళ్లు ఈ సినిమా వెనుక ఉన్నారు. కాబట్టి ప్రమోషన్లకుఢోకా లేకుండా పోయింది. రంగ్ దే, అరణ్య శుక్రవారం విడుదల అవుతోంటే, `తెల్లవారితే గురువారం` శనివారం వస్తోంది. ఆ రకంగా.. సోలో రిలీజే అనుకోవాలి. మరి ఈ మూడు సినిమాల్లో బాక్సాఫీసుని గెలుచుకునేది ఏదో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాల్సిందే.