చంద్రబాబుపై సీఐడీ ఫేక్ కేసులు పెట్టిందని కొద్ది రోజులుగా తెలుగుదేశం పార్టీ రోజుకో ఆధారం బయట పెడుతోంది. పెద్ద ఎత్తున ఎస్సీలు నష్టపోయారని.. వారంతా తనకు ఫిర్యాదులు చేశారని అందుకే తానుసీఐడీకి ఫిర్యాదు చేసినట్లుగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. అయితే ఆయనకు ఫిర్యాదు చేసిన వాళ్లు ఎవరూ రాజధానికి భూములు ఇచ్చిన వారు కాదని రెండు రోజుల కిందట.. టీడీపీ ప్రకటించారు. సర్టిఫైడ్ ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని అందులో ఉన్న వివరాలన్నింటినీ వెరీఫై చేసుకుంటున్న టీడీపీ.. వీడియో సాక్ష్యాలను కూడా రెడీ చేసుకుంటోంది. వీటన్నింటినీ ప్రణాళిక ప్రకారం ప్రజల ముందు ఉంచుతోంది.
తాము రాజధాని భూములను బలవంతంగా తీసుకోవడం వల్ల.. లేక ఇతర కారణాల వల్ల నష్టపోయామని పేర్కొన్న ఐదుగురు రైతుల గురించివివరాలను టీడీపీ సేకరించింది. అందులో రెండు కుటుంబాలు అసలు ఎస్సీ కాదని టీడీపీ నేతలు చెబుతున్నారు. మూడు కుటుంబాలు.. తాము అసలు ఫిర్యాదుచేయలేదని… తమ భూమి అమ్ముకున్నామో లేదో వివరాలు తెలుసుకోవడానికి వచ్చి సంతకాలు పెట్టించుకున్నారని… రాజకీయాలకు తమకు సంబంధం లేదని అంటున్నారు. తాడేపల్లి పోలీస్ స్టేషన్లోనూ అదే చెప్పామని అంటున్నారు. ఈ వీడియోలను టీడీపీ విడుదల చేసింది. ఇప్పుడు మొత్తంగా.. చంద్రబాబు టార్గెట్‌గా సీఐడీ అధికారులు.. ఆళ్ల రామకృష్ణారెడ్డితో కలిసి కుట్ర పన్నారని.. స్పష్టమైన ఆధారాలు లభించాయని టీడీపీ నేతలు నమ్ముతున్నారు.
వీటిని ఇలా ప్రజల ముందు పెట్టడమే కాకుండా… సీఐడీపై… ఎదురు కేసులు వేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఈ అంశంపై న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. రాజకీయ కుట్రలను పోలీసు అధికారులు అమలు చేస్తున్న వైనం… పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ఓ సలహాదారుడు.. రాజకీయం కోసం వాడుకుంటున్న వైనం బయటకు రావాలంటే.. సీఐడీని కోర్టుకు లాగాల్సిందేనని టీడీపీ నేతలు పట్టుదలగా ఉన్నారు. మొత్తంగాచంద్రబాబును ఇరికించాలని అనుకున్నారు కానీ.. ఈ కేసు రివర్స్‌లో వెళ్లే అవకాశం కనిపిస్తోందన్న ప్రచారం జరుగుతోంది.