ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి బడ్జెట్ ప్రవేశ పెట్టడం లేదు. ఆర్థిక సంవత్సం ముగిసేలోపు బడ్జెట్ ప్రవేశ పెట్టి ఆమోదం తీసుకుంటనే ఖర్చులకు నిధులు మంజూరు చేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఏపీ సర్కార్ షార్ట్ కట్ మార్గాలను ఎంచుకుంటూ… ప్రజాస్వామ్య పద్దతులను తుంగలో తొక్కుతోందన్న విమర్శలు ఎదుర్కొంటోంది. ప్రజలెన్నుకున్న ప్రభుత్వం ఏదైనా మిన్ను విరిగి మీద పడే సందర్భం తప్ప.. ఇతర సమయాల్లో బడ్జెట్ను వాయిదా వేసుకోరు. కానీ ఏపీలోని జగన్మోహన్ రెడ్డి సర్కార్ మాత్రం… బడ్జెట్ అనే దాన్ని పెద్ద అవసరంగా భావించడం లేదు. పెద్దగా ఏ కారణాలు లేకపోయినా బడ్జెట్ ను వాయిదా వేశారు. మూడు నెలల ఖర్చుల కోసం ఆర్డినెన్స్ తీసుకు వస్తున్నారు.
వరుసగా మూడో ఏడాది కూడా పూర్తి స్థాయి బడ్జెట్ లేకుండానే… ఏపీ.. తదుపరి ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెడుతోంది. రెండేళ్ల కిందట.. సాధారణ ఎన్నికల కారణంగా అప్పటి టీడీపీ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ పెట్టింది. ఆ తర్వాత ఆరు నెలలకు జగన్ సర్కార్ పూర్తి స్థాయి బడ్జెట్ పెట్టింది. గత ఏడాది కూడా.. స్థానిక ఎన్నికల ప్రక్రియ కోసం బడ్జెట్ ను వాయిదా వేసి..మూడు నెలల ఖర్చుల కోసం గవర్నర్ సంతకంతో పద్దును ఓకే చేయించుకున్నారు. ఆ తర్వాత కరోనా కారణంగా మరోసారి అలాగే చేశారు. చివరికి.. ఆరు నెలల తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టారు.
ఈ సారి కూడా.. మార్చి చివరి వారం వచ్చేసినా ప్రభుత్వం బడ్జెట్ గురించి సీరియస్గా ఆలోచించ లేదు గతంలో పందొమ్మిదో తేదీ నుంచి అసెంబ్లీ సమావేశాలు నిర్వహిస్తామని మీడియాకు లీకులు వెళ్లాయి. దానిపై స్పీకర్ కూడా తనకు సమాచారం లేదన్నారు. అంటే.. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం లేదని .. క్లారిటీ వచ్చేసింది. ఇలా.. వరుస సంవత్సరాల్లో మార్చి వారంతాల్లో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశ పెట్టని రాష్ట్రంగా… ఏపీ గురించి ఆర్థిక నిపుణుల్లో చర్చ ప్రారంభమవుతోంది. దుష్ట సంప్రదాయాన్ని నెలకొల్పుతున్నారని…ప్రజలకు సంబంధించిన వ్యవహారాలన్నీ సొంత వాటిగా భావిస్తూ… పాలన సాగిస్తున్నారని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.