తెలంగాణలో లాక్ డౌన్ భయాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ తెరదించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ లాక్ డౌన్ ఆలోచన లేదని తేల్చి చెప్పారు. విద్యా సంస్థలను మూసి వేయడానికి కారణం చెప్పారు. అక్కడి నుంచి కరోనా వ్యాప్తి జరుగుతున్నందునే మూసివేశామని.. అదీ కూడా తాత్కాలికమేనని స్పష్టం చేశారు. తెలంగాణలో మరే రంగంపైనా ఆంక్షలు ఉండవని కేసీఆర్ దీంతో తేల్చి చెప్పినట్లయింది. తెలంగాణలో కరోనా తీవ్రత ఎక్కువగా లేదని.. అయితే ప్రజలు తప్పకుండా… జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. లాక్డౌన్తో ఆర్థికంగా దెబ్బతిన్నామని ఈ సారి అలాంటి పరిస్థితి రానివ్వబోమని హామీ ఇచ్చారు.
దేశంలో అనేక రాష్ట్రాల్లో ఆంక్షలు విధిస్తున్నారు. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇలాంటి సమయంలో మెట్రో సిటీ ఉన్న తెలంగాణలోనూ ఆంక్షలు విధిస్తారన్న ప్రచారం ఉద్ధృతంగా సాగుతోంది. స్కూళ్లు మూసివేత సందర్భంగా… హోటళ్లు, సినిమా హాళ్లను ఎందుకు మూసివేయరని పలువురు ప్రశ్నించారు. వీటిపై సోషల్ మీడియాలోనూ చర్చ జరుగుతున్న సమయం సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా క్లారిటీ ఇచ్చారు. స్కూళ్ల మూసివేత కూడా తాత్కాలికమేనని తేల్చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ పలు అంశాలపై స్పందించారు.
అప్పులపై విపక్షాలు చేస్తున్న విమర్శలను ఖండించారు. తెలంగాణ అప్పులు ఎఫ్ఆర్బీఎం పరిధికి లోబడే ఉన్నాయని.. ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలను కూడా త్వరలోనే పెంచుతామని ప్రకటించారు. అదే సమయంలో రియల్ ఎస్టేట్ వ్యాపారంపైనా కూడా స్పందించారు. తెలంగాణ వస్తే రియల్ ఎస్టేట్ పడిపోతుందని శాపాలు పెట్టారని కానీ ఇప్పుడు ఏపీలో పడిపోయిందన్నారు. తెలంగాణలో భూముల ధరలు పెరిగాయి..ఏపీలో తగ్గాయి.. తెలంగాణలో ఎకరం అమ్మి ఏపీలో రెండు ఎకరాలు కొంటున్నారని చెప్పుకొచ్చారు.