రాజధాని కేసులపై మే మూడో తేదీ నుంచి విచారణ చేపట్టాలని హైకోర్టు నిర్ణయించింది. ఏపీ హైకోర్టు సీజేగా ఉన్న జేకే మహేశ్వరి బదిలీ కావడంతో కొత్త సీజేగా ఏకే గోస్వామి వచ్చారు. అప్పట్లో రాజధాని కేసులన్నీ చీఫ్ జస్టిస్ నేతృత్వంలోని ధర్మాసనంలో విచారణ జరిగేవి. కొత్త చీఫ్ జస్టిస్ రావడంతో ఆ పిటిషన్లపై విచారణ ఆగిపోయింది. ఇటీవల అడ్వకేట్ జనరల్ రాజధాని పిటిషన్ల విచారణ ప్రారంభించాలని కోరడంతో శుక్రవారం రోజు.. సీజే ఏకే గోస్వామి, జస్టిస్ బాగ్చీ, జస్టిస్ జయసూర్య ధర్మాసనం విచారణ నిర్ణయం కోసం వాదనలు విన్నది. మే 3 నుంచి రాజధాని కేసులపై కోర్టులోనే భౌతికంగా విచారణ జరపాలని.. రాజధాని కేసులపై మళ్లీ మొదటి నుంచి ప్రారంభించాలని నిర్ణయించారు.
రాజధాని అమరావతికి సంబంధించి పలు పిటిషన్లు హైకోర్టులో ఉన్నాయి. ప్రభుత్వ వికేంద్రీకరణ బిల్లు దగ్గర్నుంచి సీఆర్డీఏ రద్దు వరకూ అనేక పిటిషన్లు విచారణ జరగాల్సి ఉంది. గతంలో సుప్రీంకోర్టు రోజువారీ విచారణ ప్రారంభించింది. పిటిషనర్ల తరపు వాదనలు దాదాపుగా ముగిశాయి. ప్రభుత్వం కూడా తమ వాదనలు వినిపించింది. అయితే చీఫ్ జస్టిస్ బదిలీతో అన్నీ ఆగిపోయాయి. ఇప్పుడు కొత్తగా విచారణ ప్రారంభించాల్సిన పరిస్థితి ఉంది. ఏపీ ప్రభుత్వం మే నుంచే విశాఖకు రాజధానికి తరలించాలన్న లక్ష్యంతో ఉందన్న ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో కోర్టు విచారణ కూడా ప్రారంభం కానుంది.
అయితే సీఎం ఎక్కడి నుంచి పరిపాలించాలనేది రాజ్యాంగంలో లేదని.. తమ ఇష్టమని.. పాలకులు చాలా కాలంగ ాచెబుతున్నారు. ఈ క్రమంలో.. కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా రాజధానిని తరలించుకుని వెళ్తారా లేక… హైకోర్టు విచారణ ముగిసే వరకూ ఉంటార ాఅన్నది ఆసక్తికరంగా మారింది. హైకోర్టు రోజువారీ విచారణ చేపట్టి… ఏమైనా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికైనా సమయం పడుతుందని న్యాయనిపుణులు అంచనా వేస్తున్నారు.