తిరుపతి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రత్నప్రభకు జనసేన సహకారంపై సందిగ్ధం ఏర్పడింది. అయితే ఎన్నికల బరిలో సీరియస్‌గా నిలబడాలని నిర్ణయించుకున్న మాజీ ఐఏఎస్ రత్నప్రభ.. స్వయంగా పవన్ కల్యాణ్‌ను కలిసి మద్దతు కోరాలని నిర్ణయించుకున్నారు. అయితే జనసేన అధినేత ప్రచారం చేస్తారా లేదా అన్నదానిపై జనసేన వర్గాలు ఇప్పటికీ క్లారిటీకి రాలేకపోతున్నాయి. 30వ తేదీతో నామినేషన్ల గడువు ముగుస్తుంది. ఆ తర్వాత పధ్నాలుగు రోజుల ప్రచార గడువు ఉంటుంది. పవన్ కల్యాణ్ ప్రచారం చేస్తే.. ఈ రోజుల్లోనే షెడ్యూల్ ఖరారు చేసుకోవాలి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్‌కు చాలా బిజీ షెడ్యూల్ ఉంది.
ఆయన బీజేపీ అభ్యర్థి కోసం నేరుగా రంగంలోకి దిగే పరిస్థితి ఉండకపోవచ్చని.. వీడియోలు విడుదల చేయవచ్చని అంచనా వేస్తున్నారు. అయితే పవన్ కల్యాణ్‌పై హైకమాండ్ ద్వారా ఒత్తిడి తీసుకు వచ్చి అయినా ప్రచారం చేయించుకోవాలన్న పట్టుదలతో బీజేపీ ఏపీ నేతలు ఉన్నారు. తిరుపతిలోని ఏడు నియోజకవర్గాల్లో బీజేపీ సంప్రదాయ ఓటు బ్యాంక్ ఇరవై వేల ఓట్లు మాత్రమే ఉంది. జనసేన బలంతోనే గట్టి పోటీ ఇవ్వాలన్న లక్ష్యంతో బీజేపీ నేతలు ఉన్నారు. అయితే రత్నప్రభ బ్యాక్ గ్రౌండ్ జనసేనను కలవరపరుస్తోంది. జగన్‌ను పొగుడుతూ ఆమె పెట్టిన ట్వీట్లు.. వైరల్ కావడంతో ఇప్పుడు ఆమెకు ఎలా మద్దతివ్వాలన్న చర్చ నడుస్తోంది. ఈ గ్యాప్‌ను ఫిల్ చేయడానికి రత్నప్రభ స్వయంగా పవన్ కల్యాణ్‌తో భేటీ కావాలనుకుంటున్నారు.
మరో వైపు ఆమె కూడా వైసీపీ అభ్యర్థేనని.. వైసీపీ తరపున ఈ సారి ఇద్దరు అభ్యర్థులు నిలబడ్డారంటూ.. సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. ఈ ప్రచారాన్ని తిప్పి కొట్టడం బీజేపీ నేతలకు తలకు మించిన భారంగా మారింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ జగన్ పై నేరుగా ఎటాక్ చేయకపోతే.. ప్రజలు నమ్మే పరిస్థితి ఉండదు. ఒక వేళ రత్నప్రభ అలాంటి విమర్శలు చేస్తే.. గతంలో చేసిన పొగడ్తల సంగతేమిటన్న ప్రశ్నలు వస్తాయి. అయితే రత్నప్రభ ఎంపిక ఆషామాషీగా జరగలేదని… బీజేపీ హైకమాండ్ చాలా దూరదృష్టితోనే ఎంపిక చేసిందని అంటున్నారు. మొత్తానికి జనసేన సహకారం ఇప్పుడు బీజేపీకి అందుతుందా లేదా అన్నది సస్పెన్స్‌గా మారింది.