ఆంధ్రప్రదేశ్ కొత్త స్టేట్ ఎలక్షన్ కమిషనర్‌గా మాజీ చీఫ్ సెక్రటరీ నీలం సహాని నియమిస్తూ గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు ప్రభుత్వం పంపిన ప్రతిపాదనకు ఆమోద ముద్ర వేశారు. ప్రభుత్వం నిబంధనల ప్రకారం.. ముగ్గురు పేర్లను పంపింది. అందులో మొదటి పేరు నీలం సహానిదే ఉంది. తర్వాత రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు శామ్యూల్, ప్రేమ్ చంద్రారెడ్డి పేర్లు ఉన్నాయి. శామ్యూల్ కోసం ప్రభుత్వం పట్టుబడుతోందన్న ప్రచారం జరిగింది. అయితే.. నిబంధనల ప్రకారం అరవై ఐదు ఏళ్లు నిండిన వారిని ఎస్‌ఈసీ పదవిలో నియమించడం సాధ్యం కాదు. శామ్యూల్‌తో పాటు ప్రేమ్ చంద్రారెడ్డి కూడా అరవై ఐదు ఏళ్ల పైబడిన రిటైర్డ్ అధికారే. దీంతో నీలం సహాని ఒక్కరే రేసులో ఉన్నట్లయింది. ప్రభుత్వం కూడా ఆమె విషయంలో పూర్తి అనుకూలతతో ఉంది. దీంతో నియామకం ఖరారైంది.
నీలం సహాని ఏప్రిల్ ఒకటో తేదీన బాధ్యతలు తీసుకుంటారు. ప్రస్తుత ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ మార్చి 31వ తేదీన పదవీ విరమణ చేస్తారు. మిగిలిపోయిన పరిషత్ ఎన్నికలను నీలం సహాని పూర్తి చేస్తారు. ప్రస్తుతం నీలం సహాని… ప్రభుత్వ సలహాదారుగా ఉన్నారు. ఇటీవలే రిటైరైన ఆమెను జగన్ .. ముఖ్య సలహాదారుగా నియమించారు. ఇప్పుడు ఆమెకు మరింత ఉన్నతమైన పదవిని కల్పించారు. సీఎస్‌గా ఎల్వీ సుబ్రహ్మణ్యం ఉన్నప్పుడు.. తనకు చీఫ్ సెక్రటరీ అయ్యే అవకాశాలు లేవనుకున్న నీలం సహాని కేంద్ర సర్వీసుల్లో ఉన్నారు.
ఎల్వీతో జగన్‌కు చెడటంతో ఆమెను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేయించి తీసుకొచ్చి సీఎస్ పదవి ఇచ్చారు. స్థానిక ఎన్నికల విషయంలో … ఎస్‌ఈసీ నిమ్మగడ్డ ఆదేశాలను కాదని… ప్రభుత్వం వైపే ఉండటంతో ఆమె విధేయతకు జగన్ మెచ్చారు. వెంటనే సలహాదారు పదవి ఇచ్చారు. ఇప్పుడు సమీకరణాలు కలిసి రావడంతో వెంటనే ఎస్‌ఈసీ పదవి దక్కింది. సీఎస్‌గా ఉన్నప్పుడు ఎస్‌ఈసీ ఆదేశాలను ధిక్కరించిన ఆమె.. కోర్టులో కోర్టు ధిక్కరణ కేసు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ఆమెకే ఎస్‌ఈసీ పదవి దక్కడం కొసమెరుపు.