రేటింగ్: 2/5
ఇప్పుడంతా మల్టీప్లెక్స్ కథలదే హవా. యువతరం ప్రభావమే అది. వీళ్లు ఎంచుకునేది సున్నితమైన కథలే అయినా… వాటికి తగినంతగా కామెడీ, కొత్త రకమైన కథనాన్ని జోడిస్తే విజయాన్ని అందుకోవచ్చనే లెక్కలతో ప్రయాణం మొదలైపోతుంది. కానీ ఆ లెక్క ఏమాత్రం తప్పినా ఫలితాలు తారుమారవుతాయి. టార్గెట్ ఆడియెన్స్‌కి కూడా దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుంది. `తెల్లవారితే గురువారం` కూడా ఓ సున్నితమైన కథే. మరి దీని లెక్కలేమిటి? అవి వర్కౌట్ అవుతాయా లేదా? తెలుసుకునే ముందు కథేమిటో చూద్దాం….
ఒక రాత్రి జరిగే కథ ఇది. వీరు (శ్రీసింహా) పెళ్లి కొడుకు. తండ్రి మాట కాదనలేక పెళ్లికి రెడీ అయిపోతాడు. పెళ్లి మంటపం అందంగా ముస్తాబైంది. తెల్లారితే ముహూర్తం. కానీ పెళ్లి మంటపం నుంచి పెళ్లికొడుకు జంప్. ఒక ఫోన్ కాల్ రావడంతో బ్యాగ్ సర్దేసుకుని మంటపం నుంచి బయట పడతాడు. ఇదే ఓ ఝలక్ అనుకుంటే… సేమ్ టు సేమ్ పెళ్లి కూతురు మధు (మిషా నారంగ్) కూడా బ్యాగ్ సర్దేసుకుని బయల్దేరుతుంది. అలా పెళ్లికొడుకు, పెళ్లికూతురు కలుస్తారు. ఒకరి సమస్య గురించి మరొకరు తెలుసుకుని ఇద్దరూ పట్నం బయల్దేరతారు. అక్కడికి వెళ్లాక ఏం జరిగింది? ఇంతకీ ఈ ఇద్దరికీ పెళ్లయిందా లేదా? అనేదే అసలు కథ.
ఇదేం కొత్త కాదు. చాలా కాలం కిందటే `పెళ్లికొడుకు లేచిపోయాడు` పేరుతో ఓ నవల కూడా వచ్చింది. సూర్యదేవర మోహన్‌రావు అనే రచయిత రాసిన ఆ నవలలోనూ పెళ్లి చేసుకోవల్సిన జంట మంటపం నుంచి పారిపోతుంది. `శశిరేఖా పరిణయం` లాంటి సినిమాలు ఈ జోనర్‌లోనే వచ్చాయి. అలాంటి కథలే ఈ సినిమాకి స్ఫూర్తి కావొచ్చు. ఇప్పుడు కూడా తరచూ పత్రికల్లో పెళ్లి మంటపాలకి సంబంధించిన వార్తల్ని చూస్తూనే ఉంటాం. ఆ రకంగా అందరికీ సుపరిచితమైన నేపథ్యమే ఇది. ఇలాంటి కథలకి కథనమే కీలకం. ఎందుకు లేచిపోవాలనుకున్నారు? తర్వాత ఏం జరిగిందన్నదే ముఖ్యం. ఆ సన్నివేశాల్ని ఎంత పకడ్బందీగా, ఎంత ఆసక్తికరంగా రాసుకుంటే.. సినిమా అంతగా వర్కౌట్ అవుతుంది. ఈ సినిమా టేకాఫ్ బాగానే ఉంటుంది. తొలి ఇరవై నిమిషాలు తర్వాత ఏం జరుగుతుందనే ఆసక్తిని రేకెత్తించింది. కానీ… ఆ తర్వాతే గాడి తప్పింది. కొంచెంలో కొంచెం హీరో ఫ్లాష్‌బ్యాక్ వినోదాన్నిపంచుతుంది. హీరో ప్రేమించిన అమ్మాయి కృష్ణవేణి (చిత్రశుక్లా) పాత్ర చేసే హడావుడి, హీరో ఫ్రెండ్స్ అల్లరి వినోదం పంచుతుంది. పెళ్లికూతురు మధు ఫ్లాష్‌బ్యాక్ అయితే చప్పగా సాగుతుంది.
ఇక ఇంటర్వెల్ తర్వాత.. సన్నివేశాలన్నీ ప్రేక్షకుడి అంచనాలకి తగ్గట్టుగానే సాగిపోతుంటాయి. ఆ విషయం చిత్రబృందానికి కూడా అర్థమైపోయినట్టుంది. అందుకే మేకపిల్ల, యాక్సిడెంట్, పెళ్లి, జాతర అంటూ అజయ్‌లాంటి ఓ పెద్ద విలన్‌ని సీన్‌లోకి తీసుకొచ్చి హడావుడి చేశారు. దాంతోనైనా కథ మరింత రక్తి కడుతుందేమో అని ప్రయత్నించారు. కానీ ఆ ఎపిసోడ్ కాస్త అప్పటిదాకా ఉన్న ఫీల్‌ని మాయం చేస్తుంది తప్ప… సినిమాని రక్షించలేకపోయింది. కాస్తలో కాస్త ఈ సినిమాకి రిలీఫ్ అంటే కామెడీనే. సత్య, వైవాహర్ష తదితర కామెడీ బృందం తెరపై కనిపించిన ప్రతిసారీ నవ్వులు పండుతాయి. కథలోనూ, కథనంలోనూ వైవిధ్యం కొరవడటంతో చాలా సన్నివేశాలు చప్పగా సాగిపోతాయి. అక్కడక్కడా పార్ట్స్‌గా సినిమా మెప్పిస్తుందంతే. ఫ్యామిలీ అంతా కలిసి చూసేలా ఉండటం సినిమాకి కొద్దిలో కొద్దిగా మేలు చేకూర్చే విషయం.
నటీనటుల్లో శ్రీసింహాకే ఎక్కువ మార్కులు పడతాయి. పాత్రకి తగ్గ ఇన్నొసెన్స్ ఆయన క్యారెక్టర్‌లో పండింది. వైవాహర్ష, సత్యతో కలిసి కామెడీని కూడా బాగా పండించాడు. హీరోయిజం జోలికి వెళ్లకుండా పాత్రకి ఎంత కావాలో అంతే చేశాడు. ఇద్దరు కథానాయికల్లో చిత్రశుక్లా , మిషా నారంగ్ ఇద్దరూ బాగా నటించారు. చంచల మనస్తత్వమున్న అమ్మాయిగా చిత్ర, అమాయకమైన యువతిగా మిషా పాత్రల్లో ఒదిగిపోయారు. సత్య కామెడీనే సినిమాకి హైలెట్. వైవాహర్ష కూడా కొన్ని నవ్వులు పండించారు. రాజీవ్ కనకాల, రవివర్మ, శరణ్య తదితరులు పాత్రల పరిధి మేరకు నటించారు.
సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంది. పాటల కంటే కూడా నేపథ్య సంగీతంలో ప్రతిభ చూపాడు కాలభైరవ. సురేష్ రగుతు కెమెరా పనితనం మెప్పిస్తుంది. ఎడిటింగ్ విభాగం చేయాల్సిన పని ఇందులో చాలా ఉంది. వారాహి స్థాయిలో నిర్మాణ విలువలు ఉన్నాయి. దర్శకుడు మణికాంత్ పనితనం కొన్ని సన్నివేశాల్లోనే కనిపించింది. పాత్రల్ని డిజైన్ చేసుకున్న విధానానికి ఆయనకి ఎక్కువ మార్కులు పడతాయి. నాగేంద్ర రచన ప్రభావం మాటల్లో స్పష్టంగా కనిపిస్తుంది.
ఓవరాల్‌గా సినిమా కొన్ని నవ్వుల్ని పంచుతుంది. ఆహ్లాదంగా సాగే సన్నివేశాలు, కుటుంబ వినోదం , సున్నితమైన భావోద్వేగాలు ఈ సినిమాకి కలిసొచ్చే అంశాలు. ఎక్కువ అంచనాలు పెట్టుకోకుండా సరదా కాలక్షేపం కోసం థియేటర్లో కూర్చుంటే మాత్రం… టికెట్టు రేటు గిట్టుబాటవుతుంది.
రేటింగ్: 2/5