ఆర్థిక సంవత్సరం ప్రారంభం కంటే ముందే బడ్జెట్ ప్రవేశ పెట్టి అసెంబ్లీ ఆమోదం తీసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వాలు చేసే మొదటి పని. అలా చేస్తేనే ప్రజలు పన్నుల రూపంలో కట్టే సొమ్మును రాజ్యాంగబద్ధంగా ఖర్చు చేయడానికి అవకాశం లభిస్తుంది. అందుకే ఎన్నికలు ఉంటే.. ఓటాన్ అకౌంట్ రూపంలో అయినా ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెడతాయి. అయితే ఇలాంటి అత్యంత ముఖ్యమైన అంశంలోనూ ఏపీ సర్కార్ వరుసగా రెండో ఏడాది కూడా ఆర్డినెన్స్ తీసుకు వస్తోంది. అసెంబ్లీ సమావేశాలు నిర్వహించకుండా.. బడ్జెట్ పెట్టకుండా.. మూడు నెలల ఖర్చుల కోసం ఆర్డినెన్స్ రూపొందించి గవర్నర్‌తో సంతకం చేయించుకుని బండి నడిపించాలని నిర్ణయించింది.
ఉద్యోగుల జీతభత్యాలు, నవరత్నాల పథకాల అమలు కోసం మూడు నెలల కాలానికి 90 వేల కోట్ల రూపాయల కోసం బడ్జెట్‌ను రూపొందించింది. ప్రభుత్వం ఆన్లైన్లో మంత్రుల వద్ద నుంచి ఆమోదం తీసుకుంది. ఆర్డినెన్స్‌ను పూర్తిస్ధాయిలో రూపొందించి గవర్నర్ ఆమోదం కోసం రాజ్‌భవన్‌కు పంపారు. ఆయన సంతకం చేయడమే మిగిలింది. గత ఏడాది కూడా ఇదే విధంగా కరోనాతో బడ్జెట్‌కు ఆర్డినెన్స్ తీసుకువచ్చారు. ప్రభుత్వం ఇలా బడ్జెట్ పెట్టకుండా ఉండేంత ఎమర్జెన్సీ పరిస్థితులు లేవు. దేశంలోని అన్ని ప్రభుత్వాలు.. బడ్జెట్లు ప్రవేశ పెట్టి అసెంబ్లీ అనుమతులు తీసుకున్నాయి. అంత తీరిక లేని బిజీ ఏపీ సర్కార్‌కు ఏముందన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వం పరిమితికి మించి అప్పులు చేస్తోందన్న నివేదికలు బయటకు వస్తున్నాయి. కానీ దేనికి ఖర్చు పెట్టారో మాత్రం తెలియడం లేదు. అప్పులకు తిరిగి చెల్లింపులు ఎంత… జీతభత్యాల ఖర్చు ఎంత.. వాలంటీర్లకు.. సచివాలయ సిబ్బందికి చేస్తున్న ఖర్చు ఎంత.. ఆ నిధులన్నీ ఎలా సమీకరిస్తున్నారు.. ఇవన్నీ ప్రజలకు తెలియాల్సి ఉంది. ఆర్డినెన్స్ ద్వారా ఏపీ ఆర్థిక పరిస్థితి బాగుందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆర్డినెన్స్ ద్వారా ప్రజలకు తెలియకుండానే వారి సొమ్మును ఖర్చు పెట్టేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి.