ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ తన వారాంతపు ఆర్టికల్ కొత్తపలుకులో రాజకీయ నిష్ఠూరాలు ఎక్కువగా చేస్తూంటారు. ప్రజల్ని రెచ్చగొట్టడానికో.. చైతన్య వంతుల్ని చేయడానికో ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ సారికూడా అలాంటి ప్రయత్నమే చేశారు. సుప్రసిద్ధ వ్యక్తుల కవితలు..కొటేషన్లతో ఆర్టికల్‌ను ప్రారంభించడం ఇటీవల ఆనవాయితీగా పెట్టుకుని ఆ ప్రకారం… ఆసక్తికరంగా తన వారాంతపు ఆర్టికల్ ఉండేలా చూసుకుంటున్నారు. అయితే అంతకంటే మిన్నగా..ప్రజల్లో ఓ రకమైన గాసిప్ ప్రచారమయ్యేలా కొన్ని ఘటనలు ఇందులో ఉదహరిస్తూ ఉంటారు. ఈ వారం కూడా అలాంటివి ఉన్నాయి. వాటిలో ఒకటి కేంద్రమంత్రులకు లంచాలివ్వడం.
ఎవరైనా లంచాలు ఎక్కడిస్తారు..? వ్యక్తిగత పనులు చేయించుకోవడానికి లంచాలిస్తారు. కానీ ప్రభుత్వ పనులు చేయమని లంచాలిస్తామని ఎవరూ ఆశ చూపి ఉండరు. స్వతంత్ర భారత చరిత్రలో సరికొత్తగా ఏపీ ప్రభుత్వ పనులు చేయడానికి కేంద్రమంత్రులకు లంచాలు ఆఫర్ చేస్తున్నారట. ఆర్కే ఈ విషయాన్ని స్పష్టం చేశారు. కొన్ని ప్రభుత్వ నిర్ణయాలను ఆమోదించడానికి… ప్రభుత్వం తరపున సహకారం పొందడానికి కేంద్రమంత్రులకు కోట్లకు కోట్లే ఆఫర్లు చేస్తున్నారని… ఇదే వైపరీత్యం అని కేంద్రమంత్రులే నోళ్లు నొక్కుకుంటున్నారని ఆర్కే చెబుతున్నారు. వారు తీసుకుని అనుకూల నిర్ణయాలిస్తున్నారో లేదో మాత్రం ఆర్కే ఇందులో చెప్పలేదు. అలా చెప్పకపోవచ్చు కూడా.
ఢిల్లీలో డబ్బుతోనే వైసీపీ రాజకీయాలు చేస్తుందన్న ప్రచారం ఉందని ఆర్కే చాలా సార్లుచెప్పారు. న్యాయవ్యవస్థను నియంత్రించే ప్రయత్నంలోనూ అక్కడ డబ్బుతోనే బండి లాగిస్తున్నారని.. చివరికి ప్రత్యర్థులకు మంచి లాయర్లు దొరకకుండా.. వాదించకుండా ఉండాటానికి డబ్బులు ఆఫర్ చేస్తున్నారన్న ప్రచారం ఊపందుకుంది. ఈ విషయాలను ఆర్కేనే గతంలో బయట పెట్టారు. ఇప్పుడు కూడా ఇదే విషయాన్ని చెబుతున్నారు. వైసీపీ సర్కార్ లంచాలు ఇవ్వడం.. లంచాలు తీసుకోవడం అనే కాన్సెప్ట్ మీదే నడుస్తోందన్నబ లమైన అభిప్రాయం కల్పించడానికి ఆర్కే శతవిధాలా ప్రయత్నించారని అర్థం చేసుకోవచ్చు.
తన ఆర్టికల్‌లో… సాక్షిపత్రికకు ప్రజా ధనం వెల్లువలాప్రకటనలు వెళ్లిన అంశాన్నికూడా ప్రస్తావించారు. ఆంధ్రజ్యోతికి ఎలాంటి ప్రకటనలు ఇవ్వకపోతూండటంతో ఆయనతో అసంతృప్తి ఉంది.దాన్ని ఇలా బయట పెట్టారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని..రాజీనామా చేయాల్సి ఉంటుందన్నగా రాసుకొచ్చారు. అదే సమయంలో తన సచ్చీలతను నిరూపించుకోవడానికి గతంలో రూ. ఏడు వందల కోట్లు ఆంధ్రజ్యోతికి చంద్రబాబు ప్రభుత్వం ఇచ్చిందని… వాటిని నిరూపించాలని కూడా సవాల్ చేశారు. తన సచ్చీలతను నిరూపించుకోవడానికి… కూడా ఆర్టికల్‌ను పకడ్బందీగా ఉపయోగించుకున్నారు ఆర్కే.
ఆర్కే కొత్తపులుకు గతంలో అసహనంతో రాస్తున్నట్లుగా ఉండేది కానీ.. ఇటీవలి కాలంలో…కాస్త సంయమనం పాటిస్తున్నట్లుగా కనిపిస్తోంది. లాజిక్‌కు దూరంగా వెళ్లకుండా… ఏపీ ప్రభుత్వంపై ఎలాంటి ముద్ర వేయాలో ప్రణాళిక ప్రకారం… రాస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ విషయంలో ఆర్కే మళ్లీతన ఫామ్ అందుకున్నారని అనుకోవచ్చు.