కడప జిల్లా బద్వేలు వైసీపీ ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య కన్నుమూశారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కడప జిల్లాలో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. బద్వేలు ఎస్సీ రిజర్వుడు నియోజకవర్గం . గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన ఆయన 44వేల ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. వృత్తి రీత్యా వైద్యుడైన వెంకట సుబ్బయ్య… వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండేవారు. రాజకీయాలపై ఆసక్తి ఉండటంతో బద్వేలు నుంచి కొత్త అభ్యర్థిని నిలబెట్టాలని జగన్ అనుకోవడంతో.. ఆయనకు అవకాశం దక్కింది. తొలి ప్రయత్నంలోనే విజయం సాధించారు.
బద్వేలు నుంచి గతంలో వైసీపీ తరపున ఎమ్మెల్యేగా జయరాములు ఉన్నారు. ఆయన ఓ సారి టీడీపీలో చేరారు.తర్వాత బీజేపీలో చేరారు. రిజర్వుడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ బద్వేలులు వైసీపీకి చెందిన రెడ్డి సామాజికవర్గం నేతలే పెత్తనం చెలాయిస్తూ ఉంటారు. ఎమ్మెల్యేకు తక్కువ పని ఉంటుంది. ఆత్మాభిమానం లేదని.. ఎమ్మెల్యే అయినా తన మాట ఎవరూ పట్టించుకోవడం లేదని జయరాములు ఆవేదనతో ఉండేవారు. ఆయనకు టిక్కెట్ నిరాకరించి.. వెంకటసుబ్బయ్యకు వైసీపీ చాన్సిచ్చింది. అయితే ఆయన.. రాజకీయాల్లో పెద్దగా పాల్గొన్నది లేదు. ఎక్కువగా వైసీపీ ఇతర నేతలే పనులు చక్క బెట్టేవారు.
ప్రజాప్రతినిధులందరూ.. చిన్న పాటి అనారోగ్యం వచ్చినా హైదరాబాద్, చెన్నైలలో వైద్య సౌకర్యం పొందుతారు. కానీ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మాత్రం కడపలోనే చికిత్స పొందారు. ఆయన ఆరోగ్యం గురించి సమాచారం ఉన్న.. పార్టీ హైకమాండ్ పెద్దగా పట్టించుకోలేదన్న ఆవేదన …. వెంకట సుబ్బయ్య అనుచరుల్లో ఉంది. ఇప్పటికే వైసీపీ ఎంపీ బల్లి దుర్గా ప్రసాదరావు అనారోగ్యంతో చనిపోయారు. తిరుపతికి ఉపఎన్నిక జరుగుతోంది. ఆరు నెలల్లో బద్వేల్ కు కూడా ఉపఎన్నిక జరగనుంది.