హైదరాబాద్: దేవదాసు, సీతయ్య, లాహిరి లాహిరిలో వంటి సూపర్ హిట్ చిత్రాలు తీసిన నిర్మాత, దర్శకుడు వైవీఎస్ చౌదరికి గుడివాడలో ఉన్న సినిమా ధియేటర్ను బ్యాంక్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. చౌదరి తన సొంతఊరైన గుడివాడలో బొమ్మరిల్లు అనే ధియేటర్ను నడుపుతున్నారు . అయితే ఆ ధియేటర్ మీద తీసుకున్న బకాయిలను కొంతకాలంగా చెల్లించకపోవటంతో ఆంధ్రా బ్యాంక్ అధికారులు ఇవాళ స్వాధీనం చేసుకున్నారు. కె.రాఘవేంద్రరావు శిష్యుడైన చౌదరి అన్నపూర్ణ స్టూడియో బ్యానర్లో నాగార్జున నిర్మించిన ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి’ చిత్రంతో చౌదరి తన కెరీర్ ప్రారంభించారు. తర్వాత సీతారామరాజు, యువరాజు వంటి చిత్రాలు తీశారు. అవి పెద్దగా విజయవంతం కానప్పటికీ, దేవదాసు, సీతయ్య, లాహిరిలాహిరిలో చిత్రాలు విజయవంతమై చౌదరికి కాసులపంట పండించాయి. కానీ ఆ తర్వాత మంచు విష్ణు హీరోగా సలీమ్, బాలకృష్ణ హీరోగా ఒక్కమగాడు చిత్రాలు తీయగా అవి అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. అయితే రవితేజ హీరోగా స్నేహితుడు గుణశేఖర్ దర్శకత్వంలో నిర్మించిన నిప్పు, చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ హీరోగా పరిచయం చేస్తూ రూపొందించిన రేయ్ చిత్రాల కారణంగా చౌదరి ఆర్థికంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. రేయ్ చిత్రం షూటింగ్ పూర్తయ్యికూడా చాలాకాలం ఆగిపోయింది. సాయి ధరమ్ తేజ్ రెండో చిత్రం రిలీజై విజయవంతం అయిన తర్వాత రేయ్ విడుదలయింది. కానీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.