తొలి మూడు రోజుల్లేనే వీలైనంత రాబట్టుకోవాలన్నది నిర్మాతల తాపత్రయం. పెద్ద సినిమాలకైతే మరీనూ. అసలే టికెట్టు రేట్లు పెంచుకోవచ్చన్న గ్రీన్ సిగ్నల్స్ ప్రభుత్వాలు ఇచ్చేశాయి. దాంతో.. కళ్లాలు తెగిపోయాయి. సంక్రాంతి సీజన్‌లో టికెట్ ధరలు ఇష్టం వచ్చినట్టు పెంచుకున్నారు. మళ్లీ… మరోసారి టికెట్ రేట్లకు రెక్కలు రాబోతున్నాయి. `వకీల్‌సాబ్`తో ఈ దృశ్యం మళ్లీ చూడొచ్చు.
పవన్ కల్యాణ్ నటించిన చిత్రం `వకీల్ సాబ్`. పవన్ రీ ఎంట్రీ కోసం అభిమానులు ఎప్పటి నుంచో కాపుకాచుకుని కూర్చున్నారు. ఏప్రిల్ 9న వాళ్లకు పండగే. అయితే ఏప్రిల్ 8 అర్థరాత్రి నుంచే ప్రీమియర్ షోల హడావుడి ప్రారంభం కానుంది. టికెట్ ధర రూ.1500 గా నిర్ణయించారని టాక్. తెల్లవారుఝూము షోలకూ పర్మిషన్లు తెచ్చుకుని వీలైనన్ని ఆటలు లాగించేయాలని చూస్తున్నారు. ఆయా షోలకు టికెట్ ధర రూ.500 గా డిసైడ్ చేశార్ట. ఏపీలో చాలా చోట్ల.. ఫ్యాన్స్ షోలు పడే అవకాశం ఉంది. అక్కడ పవన్ ఫ్యాన్స్ హడావుడి ఎక్కువ. టికెట్ రేటు 2 వేలైనా కొనేస్తారని నమ్మకం. ఈ సినిమాని రికార్డు ధరలకు బయ్యర్లు కొనేశారు. ఆ డబ్బు తిరిగి రాబట్టుకోవాలంటే ప్రీమియర్, స్పెషల్ షోలు తప్పనిసరి. పైగా.. తొలి మూడు రోజులకూ టికెట్ ధర రూ.200గా చేసేయాలని దిల్ రాజు భావిస్తున్నాడు.
తొలి రోజు టాక్ బాగుంటే… మూడు రోజులూ హౌస్‌ఫుల్స్ ఖాయం. టికెట్ 200 అయితే… వీకెండ్ తోనే సగానికి పైగా పెట్టుబడి రాబట్టేయొచ్చని బయ్యర్లు నమ్ముతున్నారు. సో… టికెట్ రేటు 200 అవ్వడం గ్యారెంటీ. మరీ 200 అంటే.. సామాన్యుడికి వకీల్ సాబ్ అందుతుందా? పవన్ విశ్వరూపం వెండి తెరపై చూడాలంటే టికెట్ రేటు సాధారణమయ్యేంత వరకూ ఆగాల్సిందే. ఒక వేళ.. 200 పెట్టినా జనం తండోపతండాలుగా వచ్చి, ఎగబడితే.. రాబోయే `ఆచార్య`, `బీబీ 3` లాంటి సినిమాలకు సైతం…. ఫార్ములా రిపీట్ కావొచ్చు.