చిరంజీవి మంచి జోష్‌లో ఉన్నారు. వరుసగా సినిమాల్ని ఒప్పుకుంటున్నారు. సినిమాకీ సినిమాకీ ఎలాంటి గ్యాప్ లేకుండా… చకచక ప్రాజెక్టుల్ని పూర్తి చేయాలన్న తపనతో కనిపిస్తున్నారు. `ఆచార్య` పూర్తవ్వకుండానే లూసీఫర్ రీమేక్‌కి ఓకే చెప్పేశాడు. ప్రస్తుతం మోహన్ రాజా ఆధ్వర్యంలో స్క్రిప్టు పనులు చక చక సాగుతున్నాయి. ఇప్పుడు బాబీ కథకూ ఓకే చెప్పేసినట్టు టాక్. బాబీ దర్శకత్వంలో చిరంజీవి కథానాయకుడిగా ఓ సినిమా రూపుదిద్దుకోనుందని ముందు నుంచీ ప్రచారం జరుగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు దాదాపుగా ఓకే అయిపోయినట్టే. అతి త్వరలోనే ఓ అధికారిక ప్రకటన రానుంది.
అయితే బాబీ కంటే ముందుగా మెహర్ రమేష్‌కి మాటిచ్చాడు చిరు. `వేదాళం` రీమేక్ ని మెహర్ పట్టాలెక్కించాల్సివుంది. కథ కూడా రెడీ అయిపోయింది. లూసీఫర్ కంటే ముందు బాబీ సినిమా కంటే ముందు.. ఈ ప్రాజెక్టు పట్టాలెక్కాలి. కానీ రోజు రోజుకీ ఆలస్యం అవుతోంది. ఇప్పుడు బాబీ సినిమా కూడా ఓకే అయిపోయినా, మెహర్ కి గ్రీన్ సిగ్నల్ లభించలేదు. తన సినిమాకి సంబంధించిన ఓ అప్ డేట్.. చిరు ద్వారా వస్తే బాగుంటుందని మెహర్ ఆశ పడుతున్నాడు. కానీ చిరు మాత్రం బాబీ, మెహర్ రెండు సినిమాల్నీ ఒకేసారి పట్టాలెక్కించాలని భావిస్తున్నాడట. ఈ సినిమాల షూటింగులు సమాంతరంగా జరిపి.. రెండు నెలల గ్యాప్ లో రెండు సినిమాల్నీ విడుదల చేయాలని చూస్తున్నాడట. ఓ అధికారిక ప్రకటన వస్తే రిలాక్స్ అయిపోవొచ్చన్నది మెహర్ ఆశ. కానీ.. చిరు ఏం చేస్తాడో?