అధికార పార్టీకి చెందిన నేతలు తమ హయాంలో రాష్ట్రంలో అన్ని సదుపాయాలతో పాటు వైద్య సదుపాయాలు కూడా ఎంతో మెరుగయ్యాయి అని ప్రజలకు చెబుతూ ఉంటారు. కానీ నిజంగా వారికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే మాత్రం రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో కాదు కదా కనీసం ప్రైవేటు ఆస్పత్రిలో కూడా చికిత్స చేయించుకోకుండా పక్క రాష్ట్రాలకు పరుగులు తీస్తున్నారు. ఇది ప్రజల్లో చర్చకు దారితీస్తోంది. వివరాల్లోకి వెళితే..
చెన్నై లో చికిత్స చేయించుకున్న రోజా:
వై ఎస్ ఆర్ సి పి నేత, నగరి ఎమ్మెల్యే రోజా అనారోగ్యానికి గురి కావడం తో 2 సర్జరీలు చేయవలసి వచ్చింది. మొన్నామధ్య జబర్దస్త్ ప్రోగ్రాం లో రోజా స్థానంలో ఇంద్రజ కనిపించినప్పుడు కొందరు ప్రేక్షకులకు అనుమానం వచ్చింది కానీ, ఏదైనా రాజకీయ కార్యక్రమం వల్ల జబర్దస్త్ కి రాలేకపోయింది ఏమో అనుకున్నారు. అయితే రోజాకు చెన్నైలోని ఆసుపత్రిలో శస్త్రచికిత్స జరిగింది. ఆవిడ త్వరగా కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే కొందరు ప్రజల్లో మాత్రం అధికార పార్టీకి చెందిన నేతలు తమ హయాంలో రాష్ట్రంలో అన్ని సదుపాయాలతో పాటు వైద్య సదుపాయాలు కూడా ఎంతో మెరుగయ్యాయి అని ప్రజలకు చెబుతూ ఉంటారు కదా మరి వారికి స్వయంగా అవసరం అయినప్పుడు మాత్రం ప్రభుత్వ ఆసుపత్రుల సంగతి పక్కన పెడితే, కనీసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రులు కూడా వీరికి చికిత్స చేయగలిగిన స్థాయిలో లేవా అని ప్రశ్నిస్తున్నారు. అయితే ఇలా జరగడం ఇది మొదటిసారి కాదు.
చికిత్సకోసం హైదరాబాద్, చెన్నై ,బెంగుళరు లకు పరిగెత్తుతున్న అధికార పార్టీ నేతలు:
కొద్ది నెలల కిందట వైఎస్ఆర్సిపి ఎంపీ విజయసాయిరెడ్డి ఆంధ్రప్రదేశ్ లో మెరుగైన వైద్య సౌకర్యాల గురించి ట్విట్టర్లో ఊదరకొట్టారు. ఆయన అలా ఊదరగోడుతున్న కొద్ది రోజులకే ఆయనకు కరోనా సోకింది. ఆయన ఆగమేఘాలమీద హైదరాబాదులోని అపోలో కి చికిత్సకోసం వచ్చారు. అప్పుడు కూడా ప్రజలు ఆయనను ట్విట్టర్లో ఇదే విషయం ప్రశ్నించారు. మరొక ఎమ్మెల్యే అంబటి రాంబాబు కు కరోనా సోకినప్పుడు కూడా ఇదే రిపీట్ అయింది. ఆయన హైదరాబాద్లో చికిత్స చేయించుకోవడం కూడా ఇదే రకమైన విమర్శలకు తావిచ్చింది. ఇక సూళ్లూరుపేట ఎమ్మెల్యే సంజీవయ్య కు అనారోగ్యం కలిగితే అప్పట్లో ఆయన కూడా చెన్నైలోని ఆసుపత్రులకు వెళ్లారు. ఇక ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి అంజాద్ భాష సైతం అప్పట్లో తన ఆరోగ్యానికి కావలసిన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చేరారు. ఇప్పుడు రోజా కూడా చెన్నైలో చికిత్స చేయించుకోవడం చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లోని వైద్య సౌకర్యాలు ఎలా ఉన్నాయో అవగతం అవుతోంది. అనంతపురం తదితర ప్రాంతాలకు చెందిన నేతలు బెంగుళూరుకు, చిత్తూరు నెల్లూరు జిల్లాలకు చెందిన నేతలు చెన్నైకి, రాయలసీమ తదితర ప్రాంతాలకు చెందిన అధికార పార్టీ నేతలు హైదరాబాదుకు పరుగులు తీస్తూ ఉండడం ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపిస్తుందని తెలిసి కూడా అధికార పార్టీ నేతలు అలా చేస్తున్నారు అంటే రాష్ట్రంలోని వైద్య పరిస్థితులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమవుతుంది.
అయితే గతంలో కర్ణాటకకు చెందిన మంత్రి నటుడు అంబరీష్ ఒక చికిత్స కోసం సింగపూర్ వెళ్ళినప్పుడు కూడా ప్రజలు ఇదే విధంగా ప్రశ్నించారు. దేశంలోని వైద్య సౌకర్యాలను మెరుగు పరిస్తే ఈ అవసరం తప్పేది కదా అంటూ అప్పట్లో వ్యాఖ్యానించారు కర్ణాటక ప్రజలు. నిజానికి భారత దేశంలో వైద్య సౌకర్యాలు ఇరుగు పొరుగు దేశాలతో పోలిస్తే బాగానే ఉంటాయి. మెడికల్ టూరిజం కారణంగా మన దేశానికి చాలా రెవెన్యూ కూడా వస్తోంది. కానీ రాష్ట్రాలవారీగా చూస్తే వైద్య సౌకర్యాల విషయంలో అసమానతలు కనిపిస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆ సౌకర్యాలు ఏ స్థాయిలో ఉన్నాయి అన్నది ప్రజలకు మరొకరు చెప్పవలసిన అవసరం లేకుండా, రాష్ట్రాన్ని పాలిస్తున్న అధికార పార్టీకి చెందిన నేతలే వారి చేతల ద్వారా రాష్ట్రంలోని పరిస్థితుల గురించి ప్రజలకు తెలియజేస్తున్నారు.