అహనా పెళ్లంట సినిమాలో హీరోయిన్‌ను ఇచ్చి పెళ్లి చేయడానికి ఎంత మంది వస్తే అంత మందితో ఓకే అంటాడు.. పిసినారి.. డబ్బు పిచ్చి తండ్రి. అయితే అదంతా కామెడీ యాంగిల్. ఆ తండ్రికి.. ఆ అమ్మాయికి.. క్రిమినల్ మైండ్ ఉంటే… ఏం జరుగుతుందో అన్నది మధ్యప్రదేశ్‌లో రియల్‌గా వెలుగుచూసింది. ఐదుగురికి పెళ్లి చేసుకుంటానని.. పెళ్లి మండపానికి రమ్మని చెప్పింది. తీరా అక్కడకు వెళ్లేసరికి అందరికీ మోసపోయామని అర్థమైంది. ఇలా ఒకరు కాదు.. ఇద్దరు కాదు.. ఏకంగా ఐదుగుర్ని ఒకే ముహుర్తంలో మోసం చేసేసింది ఆ కిలాడీ యువతి.
మధ్యప్రదేశ్‌లో హార్దా అనే జిల్లా ఉంది. చాలా కాలంగా పెళ్లి కోసం ఎదురు చూసి.. చివరికి ఓ సంబంధం కుదరడంతో .. ఇంటి దగ్గర భోజనాలు పెట్టుకుని అనుకున్న సమయానికి కళ్యాణ మండపం వద్దకు వచ్చాడో పెళ్లికొడుకు. కానీ కల్యాణమండపానికి తాళం వేసి ఉంది. వాచ్‌మెన్‌ని ఆరా తీస్తే.. ఆ రోజేమీ పెళ్లిళ్లకు బుక్ చేసుకోలేదని చెప్పారు. దీంతో వెంటనే… పెళ్లి కుమార్తెకు.. ఆమె బంధువులకు ఫోన్ చేశాడు వరుడు. కానీ స్విచ్చాఫ్ అని వచ్చింది. దీంతో ఫిర్యాదు చేద్దామని పోలీసుల వద్దకు వెళ్లారు. అతను అక్కడ ఉండగానే… పెళ్లి కూతురు కనిపించడం లేదంటూ మరో నలుగు వచ్చారు. ఒకరి తర్వాత ఒకరు వస్తూండటంతో పోలీసులకు కూడా ఈ కేసు ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. ఇంకా ఎంత మంది వస్తారో అని ఎదురు చూశారు కానీ.. ఐదుగురితో ఆ సంఖ్య ఆగిపోవడంతో అందరి దగ్గరా ఫిర్యాదులు తీసుకుని అసలు లెక్క తేల్చారు. ఏంటంటే.. ఐదుగుర్ని మోసం చేసింది ఒకే యువతి.
మధ్యప్రదేశ్‌లో పెళ్లి కాని ప్రసాద్‌లు ఎక్కువగా ఉండటంతో కొంత మంది ఓ ముఠాగా ఏర్పడ్డారు. ముందుగా పెళ్లి సంబంధాలు కుదిర్చేవారికి వారి ఫోన్ నంబర్లు ఇస్తారు. తర్వాత వారు తెచ్చే సంబంధాలను చూస్తారు. డబ్బులు వసూలు చేయడం ప్రారంభిస్తారు. వీలైనంతగా డబ్బులు వసూలు చేసి.. చివరికి పెళ్లి ముహుర్తం ఖరారు చేస్తారు. కానీ అదృశ్యమైపోతారు. పెళ్లి అవుతుందని… ఉన్నంత వరకూ చదివించుకున్న పెళ్లి కాని ప్రసాద్‌లకు.. అటు డబ్బులూ పోతాయి.. ఇటు పరువూ పోతుంది. ఇంతా చేసినా పెళ్లి కూడా కాదు.
ఇలాంటి మోసాలతో బాలీవుడ్‌లోనూ సినిమాలు వచ్చాయి. సమాజంలో స్త్రీ పురుషుల నిష్పత్తి తగ్గుతున్న సమయంలో ఇలాంటి మోసాలు ఆన్ లైన్‌లోనూ పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. రియల్ గానూ.. అదే పరిస్థితి. చైతన్యమే ఈ మోసాలకు విరుగుడు.