పింక్‌ని తెలుగులో రీమేక్ చేస్తున్నారు అనగానే… పవన్ కల్యాణ్ స్టైల్‌కి, ఇమేజ్ కీ అది సూటవుతుందా? అని అనుమానించారంతా. అయితే.. మెల్లమెల్లగా ఆ అనుమానాలు తీరిపోతూ వచ్చాయి. `వకీల్ సాబ్` ట్రైలర్‌తో వాటిని పూర్తిగా తీర్చేసింది చిత్రబృందం. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈరోజు సరిగ్గా 6 గంటలకు ట్రైలర్ విడుదల చేశారు.
`ఆర్ యూ వర్జిన్` అనే ప్రకాష్ రాజ్ డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. అమ్మాయిలు – కోర్టు గొడవలు…. వీటి మధ్య ఓ ఎమోషన్ మూమెంట్ లో పవన్ కల్యాణ్ ఎంట్రీ ఇచ్చాడు. ఇదో కోర్టు డ్రామా. దానికి తగ్గట్టుగానే కోర్టు రూమ్ లో సంభాషణలే ఎక్కువగా వినిపించాయి. ప్రకాష్ రాజ్ – పవన్ కల్యాణ్ మధ్య – కోర్టు వాదనలు, ఎత్తుకు పై ఎత్తులు చాలా ఆసక్తికరంగా సాగినట్టే అనిపిస్తోంది. చాలా భాగం `పింక్`ని చూస్తున్నట్టే అనిపించినా, మధ్యమధ్యలో వచ్చేయాక్షన్ బిట్లు.. అందులో పవన్ కల్యాణ్ టచ్చింగులు కావల్సినన్ని అద్దారన్న సంగతి చెప్పకనే చెబుతున్నాయి. `ఆర్ యూ వర్జిన్` అంటూ పవన్ కల్యాణ్ ఓ పాత్రని అడగడం… వర్జినిటీ అబ్బాయిలకు కూడా అని చెప్పే ప్రయత్నం అనిపిస్తుంది. `పింక్`లో ఈ ఎపిసోడ్ లేదు.
మాస్ డైలాగులు, హీరోయిజం కోసం రాసుకునే పంచ్‌లు లేకుండా చూసుకున్నారు. శ్రుతిహాసన్ లవ్ ట్రాక్ మొత్తానికి ఎక్కడా కనిపించలేదు. బహుశా… థియేటర్ ఆడియన్స్ కోసం దాచి ఉంటారు. `వకీల్ సాబ్` ప్రస్తావన ఎప్పుడొచ్చినా `ఇది అమ్మాయిల కథ కదా.. వాళ్లేరి` అంటూ.. చాలామంది ప్రశ్నించారు. ఎందుకంటే ప్రతీ పోస్టరులోనూ.. పవన్ మాత్రమే కనిపించేవాడు. ఇప్పుడు వాళ్లందరికీ సమాధానం దొరికేసినట్టైంది. ఈ ట్రైలర్లో మిగిలిన ముగ్గురు అమ్మాయిలకూ అంతే ప్రాధాన్యం ఇచ్చారు. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, పవన్ కల్యాణ్ జోష్.. `పింక్`కి కొత్త సొగసులు అద్దాయి. మరి థియేటర్ లో బొమ్మ ఏ రేంజులో దద్దరిల్లు తుందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.