గ్రేటర్ ఎన్నికలకు ముందు వ్యవసాయ చట్టాలను తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్… ఆ తర్వాత వ్యవసాయ చట్టాలను సమర్థించారు. అంతే కాదు రైతులు కొత్త చట్టం ప్రకారం ఎక్కడైనా అమ్ముకోవచ్చని.. అందుకే కొనుగోలు కేంద్రాలన్నింటినీ ఎత్తివేస్తున్నామని ప్రకటించారు. దీంతో సహజంగానే తెలంగాణలో గగ్గోలు రేగింది. మంత్రి ఈటల రాజేందర్ చాలా దూకుడుగా వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వమే పంటలను కొనుగోలు చేసి తీరాలని ఆయన అన్నారు. అప్పట్లో పెద్దగా నోరు మెదపని టీఆర్ఎస్ నేతలు… కొద్ది రోజుల నుంచి పంటలను కొనుగోలు చేయరని ఎవరు చెప్పారని ఎదురు ప్రశ్నించడం ప్రారంభించారు. ఇప్పుడు కేసీఆర్.. తన ప్రకటన నుంచి ఒక్క సారిగా రివర్స్ అయ్యారు.
ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని.. చేయాలని నిర్ణయించారు. యాసంగిలో వరి ధాన్యం కొనుగోలుపై ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించిన కేసీఆర్ గ్రామాల్లో 6,408 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రూ.20 వేల కోట్ల బ్యాంకు గ్యారంటీ ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. కొనుగోలు కేంద్రాల తక్షణ ఏర్పాటు కోసం..కలెక్టర్లతో అత్యవసర వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని సీఎస్‌కు సూచించారు. ధాన్యం కొనుగోళ్లను నిరంతరం పర్యవేక్షించాలని మంత్రి నిరంజర్రెడ్డిని ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో కేసీఆర్ దూకుడు చూసి టీఆర్ఎస్ నేతలు కూడా ఆశ్చర్య పోతున్నారు. ఇంతగా ఎందుకు యూటర్న్ తీసుకున్నారన్న చర్చ నడుస్తోంది.
ఓ వైపు సాగర్ ఎన్నిక.. మరో వైపు.. రైతుల్లో మళ్లీ ఆదరణ పొందడం లాంటి సమీకరణాలన్నీ కలుపుకుని కేసీఆర్ ధాన్యం కొనుగోలుపై నిర్ణయం మార్చుకున్నారన్న చర్చ నడుస్తోంది. ఏదైతేనేం… ఈటలకు మరో అస్త్రం లేకుండా చేయడంలో కేసీఆర్ సక్సెస్ అయ్యారని అంటున్నారు. ఒక వేళ కేసీఆర్ సర్కార్ ధాన్యం కొనుగోలు చేయకపోతే.. ఈటల తన వాయిస్ మరింత బలంగా వినిపించడానికి చాన్స్ ఇచ్చినట్లు ఉండేదన్న చర్చ కూడా ఉంది.