తెలుగుదేశం పార్టీ నేత రాయపాటి సాంబశివరావుకు చెందిన ట్రాన్స్ట్రాయ్ కంపెనీ వివిధ బ్యాంకులకు ఎగ్గొట్టింది రూ. 10,115 కోట్లు అని తాజాగా దర్యాప్తు సంస్థలు లెక్కలు తేల్చాయి. వివిధ ప్రాజెక్టుల కోసం రుణాలు తీసుకోవడం.. వాటిని వేరే కంపెనీలు పెట్టి దారి మళ్లించడం వంటివి చేశారని ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ దర్యాప్తులో తేల్చింది. మొత్తంగా ఈడీ దర్యాప్తుచేసిన మొత్తానికి ఇటూ ఇటూ మొత్తమైనా ట్రాన్స్‌స్ట్రాయ్ సంస్థ బ్యాంకులకు పంగనామం పెట్టిందనేదిమాత్రం నిజం. ఆ సొమ్ములన్నీ ఎటు పోయాయన్నది ఇప్పుడు తేల్చాల్సింది ఈడీ, సీబీఐలే. ఇప్పటికే రాయపాటిపై సీబీఐ కేసులు నమోదయ్యాయి. ఒకటికి రెండు సార్లు వచ్చి సోదాలు చేసి కూడా పోయారు. ఏం చేసి పోయారో మాత్రం క్లారిటీ లేదు.
విజయ్ మాల్యా మొత్తంగా ఎగవేసింది రూ. ఏడు వేల కోట్లు మాత్రమే. ఆయన డిఫాల్టర్. తనకు అంతకు మించిన ఆస్తులు ఉన్నాయని.. అమ్మేసే అవకాశం ఇస్తే చెల్లిస్తానని చెబుతున్నారు. ఇప్పుడు రాయపాటి.. కనీసం తాను బ్యాంకులను ముంచిన మొత్తానికి సంబంధించి ఏమైనా చెల్లిస్తామని కూడా చెప్పడం లేదు. ట్రాన్స్‌స్ట్రాయ్‌తో ఇప్పుడు తనకు సంబంధం లేదని చెబుతున్నారు. చెరుకూరి శ్రీధర్ అనే వ్యక్తి పేరిట ఇప్పుడు ప్రధానంగా కంపెనీ ఉంది. కాంగ్రెస్ పార్టీ సర్కార్.. ఇచ్చిన పోలవరం ప్రాజెక్ట్ 2013లోదక్కింది. కానీ ట్రాన్స్ స్ట్రాయ్ అంతకు ముందు నుంచే అంటే.. 2003 నుంచే బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని దారి మళ్లించడం ప్రారంభించిందని.. ఈడీ రిపోర్ట్ వెల్లడిస్తోంది.ఈ ప్రకారం…నిధుల దారి మళ్లింపులపై స్పష్టమైన ఆధారాలు ఈడీ వద్ద ఉంటాయనే అంచనాలు ఉన్నాయి.
ఇప్పుడు.. బ్యాంకులు ఇలా అప్పులు తీసుకుని ఎగ్గొట్టిన బడా వ్యక్తులకు సంబంధించిన లక్షల కోట్ల రుణాలు రైటాఫ్ చేయడం వివాదాస్పదం అవుతోంది. మోడీ హయాంలో.. ఆరేళ్ల కాలంలో ఏడు లక్షల కోట్లు ఇలా మాఫీ చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయితే రైటాఫ్ చేయడం అంటే మాఫీ చేయడం కాదని చెబుతున్నారు కానీ.. అవన్నీ వసూలు కాని బాకీలుగా లెక్క గట్టి లెక్కల్లోనుంచి తీసేయడమే. ఇలాంటివి ఆర్థిక వ్యవస్థకు చేటు చేస్తాయి. అయితే పదుల సంఖ్య లో ఇలాంటి ఆరోపణలు వచ్చిన పారిశ్రామికవేత్తలు బీజేపీలోచేరి రక్షణ పొందారు. వారెవరిపైనా చర్యలు తీసుకోవడం లేదు. సుజనా విషయంలోనూ అదే జరిగింది. ఇప్పుడు రాయపాటి తన రాజకీయ కెరీర్ అయిపోయిందని… సైలెంట్‌గా ఉంటారో..బీజేపీలో చేరి కేసులపై రక్షణ పొందుతారోనన్న చర్చ జరుగుతోంది.