కడప స్టీల్ ప్లాంట్‌కు పెట్టుబడి పెడతారంటూ.. బ్రిటన్ నుంచి లిబర్టీ స్టీల్స్ అనే కంపెనీని తీసుకు వచ్చారు. ముఖ్యమంత్రి జగన్‌తో భేటీ నిర్వహించారు. జగన్ కూడా కడపలో స్టీల్ ప్లాంట్ వస్తుందని అంగీకరించారు. అతిథి మర్యాదలు తీసుకున్నారు. వెళ్లారు. లిబర్టీ స్టీల్స్ తీసుకు వచ్చిన కన్సల్టెన్సీ సంస్థ ఎస్బీఐ క్యాప్స్ తమ కమిషన్ తాము తీసుకుంది. ఇంతా జరిగి నెల రోజులు కూడా కాలేదు. ఇప్పుడు ఆ సంస్థ దివాలా దీసింది. కన్సల్టెన్సీ సంస్థ ఎస్బీఐ క్యాప్స్ కాదు… ఏకంగా స్టీల్స్ కంపెనీ లిబర్టీనే. బ్రిటన్‌కు చెందిన లిబర్టీ స్టీల్స్ దివాలా ప్రక్రియ నడుస్తోంది. రోజువారీ ఖర్చులకు కూడా డబ్బుల్లేవని సర్దాలని అక్కడి ప్రభుత్వాన్ని కోరితే… బ్రిటన్ సర్కార్ తిరస్కరించింది. దీంతో ఇప్పుడు.. ఆ సంస్థకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. ఆ సంస్థ దీన స్థితిని పక్కన పెడితే.. ఇక్కడ కడపలో స్టీల్స్ పరిశ్రమ మరోసారి ఇలా చిక్కుల్లో పడటం ప్రభుత్వానికి ఇబ్బందికరంగా మారింది. ఎస్బీఐ క్యాప్స్‌ను కమిషన్ బేసిస్ మీద ఏపీ సర్కార్.. రుణాలు.. పెట్టుబడుల సమీకరణకు కన్సల్టెన్సీగా పెట్టుకుంది.
కడపలో ఉక్కు పరిశ్రమను మూడేళ్లలో మొదటి దశలో ఉత్పత్తి ప్రారంభించేలా చేస్తామని జగన్ హామీ ఇచ్చారు. అనేకానేక ప్రయత్నాలు చేసిన తర్వాత లిబర్టీ స్టీల్స్ రూ. పదివేల కోట్ల పెట్టుబడికి ముందుకు వచ్చింది. ఇక అంతా సాఫీగానే అనుకున్న సమయంలోనే బ్రహ్మణి స్టీల్స్లాగానే ఆ పరిశ్రమ కూడా మారిపోయింది. లిబర్టీ స్టీల్స్ వస్తుందని. .. ఇప్పటి వరకూ వెచ్చించిన మొత్తం వృధా అయింది. దివాలా అంచున ఉన్న కంపెనీ రూ. పదివేల కోట్లతో ఉక్కు పరిశ్రమ పెడుతుందని ఎలా అనుకున్నారని ప్రభుత్వంపై విమర్శలు వస్తూంటే.. సమాధానం చెప్పలేని పరిస్థితి మంత్రి గౌతంరెడ్డికి ఏర్పడింది. బ్రిటన్ ప్రభుత్వానికి లేఖ రాస్తామని… లిబర్టీ కాకపోతే ఎస్సార్ స్టీల్స్ ప్లాంట్ పెడుతుందని చెప్పుకొస్తున్నారు.
స్టీల్ ప్లాంట్ అంటే ఆషామాషీ కాదు. నాణ్యమైన గనులు కూడా ఉండాలి. అయితే కడపలో స్టీల్ ప్లాంట్ పెట్టాలనుకునేవారికి కొన్ని గనులు అందుబాటులో ఉన్నాయి. అందుకే పెద్ద ఎత్తున పెట్టుబడిదారులు వస్తారని ప్రభుత్వం ఆశిస్తోంది. సీఎం జగన్ సొంత జిల్లా కడపకు.. ఐదేళ్లలో… ఉక్కు పరిశ్రమ తేవాలని పట్టుదలగా ఉన్నారు. చంద్రబాబు ఐదేళ్ల హయాంలో కియా పరిశ్రమ వచ్చి ఉత్పత్తి ప్రారంభించింది. ఆ స్థాయిలో పరిశ్రమను తీసుకొచ్చి ఉత్పత్తి ప్రారంభించాలన్న లక్ష్యంతో జగన్ ఉన్నారు. కానీ కన్సెల్టెన్సీ ఆయన ఆశలను చిదేమేస్తోంది. ముందూ వెనుకా చూసుకోకుండా… ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ సమస్య వస్తోంది.