ఈసారి నేషనల్ అవార్డుల జాబితాలో తెలుగు సినిమా మెరిసింది. జెర్సీ, మహర్షి చెరో రెండు అవార్డులూ అందుకున్నాయి. నేషనల్ అవార్డు అంటే…ప్రతిష్టాత్మక విషయమే. కాబట్టి తప్పకుండా దానిదంటూ ఓ మైలేజీ ఉంటుంది. కానీ విచిత్రంగా.. నేషనల్ అవార్డు తెచ్చిన పెట్టిన ఆ ఇద్దరు దర్శకులూ… వంశీ పైడిపల్లి, గౌతమ్ తిన్ననూరి హీరోల పిలుపు కోసం సుదీర్ఘమైన నిరీక్షణలో ఉండడం.
మహర్షి తరవాత.. వంశీ పైడిపల్లి ఒక్క సినిమా కూడా చేయలేదు. ఫలానా హీరోతో సినిమా చేస్తున్నా.. అని ప్రకటించలేదు. ఈ గ్యాప్లో తాను కలవని హీరో లేడు. అల్లు అర్జన్ దగ్గర్నుంచి విజయ్ దేవరకొండ వరకూ అందరినీ ఓ రౌండ్ వేసేశాడు. కానీ… ఫలితం లేదు. `జెర్సీ`ని బాలీవుడ్లో తెరకెక్కిస్తున్నాడు గౌతమ్. తన తదుపరి సినిమాని తెలుగులో, ఓ బడా హీరోతో చేయాలన్నది తన ఆలోచన. చరణ్ తో సినిమా దాదాపుగా ఓకే అన్న టాక్ వినిపిస్తోంది. కానీ.. అధికారికంగా ఎలాంటి సమాచారం లేదు. చిత్రసీమలో… అఫీషియల్ స్టేట్ మెంట్లు వచ్చిన సినిమాలలే చివరి క్షణాల్లో చేతులు మారుతూ ఉంటాయి. ఇలా ఊహాగానాల్లో ఉన్న కాంబినేషన్ల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంది? తనతో సినిమా విషయంలో చరణ్ ఓ స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుందని గౌతమ్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాడు.
ఇలాంటి తరుణంలోనే జాతీయ అవార్డుల ప్రకటన వచ్చింది. గౌతమ్, వంశీ తీసిన సినిమాలకు అవార్డులు అందాయి. మరి వీటికి మైలేజీ ఉందా? ఉంటే… అవార్డు అందిన ఆనందంలో… హీరోల నుంచి ఈపాటికే వీరిద్దరికీ పిలుపు రావాలి. కానీ అలాంటిదేం జరగలేదు. నేషనల్ అవార్డు వచ్చిన ఊపు రెండు మూడు రోజులే. ఆ తరవాత… అంతా మామూలే. వీరిద్దరి విషయంలోనూ అదే జరుగుతుందా? అనిపిస్తుంది. `జెర్సీ` తరవాత గౌతమ్ ఏమీ ఖాళీగా లేడు. ఆ సినిమాని హిందీలో రీమేక్ చేస్తూ బిజీగా ఉన్నాడు. వంశీ పరిస్థితే దారుణం. మహర్షి విడుదలై.. ఇన్నాళ్లయినా తను ఖాళీనే. ఓ సినిమా ఓకే చేయించుకోవాలన్న తపన, కంగారు తనకే ఎక్కువ. మరి..జాతీయ అవార్డు చూసైనా హీరోలెవరైనా కనికరిస్తారేమో చూడాలి.