తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న నాగార్జున సాగర్ అసెంబ్లీ, తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికలను బీజేపీ స్థానిక నేతలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. అయితే వారికి కేంద్ర పెద్దల నుంచి అందే ప్రచార సాయం కొంతేనని తెలుస్తోంది. ఆర్థిక వనరులకు లోటు లేకపోయినప్పటికీ.. చర్మిష్మా ఉన్న నేతలు వచ్చి ప్రచారం చేయాల్సి ఉంది. అయితే ఐదు రాష్ట్రాల ఉపఎన్నికలు ఉన్నాయి. వాటి ప్రచారంతో పాటు… వ్యూహాల అమలు కోసం… నరేంద్రమోడీ, అమిత్ షా బిజీగా ఉన్నారు. ఇప్పుడు వారికి ఉపఎన్నికలపై తీరిక చూపించే అవకాశం లేదు. అదే సమయంలో తమిళనాడు, కేరళల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. పుదుచ్చేరిలో గెలిచే చాన్స్ కూడా ఉందని అంటున్నారు. అయినప్పటికీ… బెంగాల్, అసోంపైనే ఎక్కువగా అమిత్ షా దృష్టి పెట్టారు.
అక్కడ గెలవడం.. ఇజ్జత్‌కా సవాల్ గా తీసుకున్నారు. నిజానికి అక్కడ గెలుపుచాన్సులు కూడా ఉన్నాయి. కానీ తమిళనాడు, కేరళల్లో లేవు. సాగర్, తిరుపతిల్లో చెప్పాల్సిన పని లేదు. బీజేపీ గాలి ఏదైనా ఉద్ధృతంగా వీస్తే తప్ప.. గెలిచే అవకాశం లేదు. అలాంటి గాలి ఏదైనా ఉందో లేదో చెప్పలేరు. అందుకే.. సాగర్, తిరుపతిల్లో స్థానిక నేతలే ఎక్కువగా ప్రచార భారాన్ని మోయడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే సాగర్ అసెంబ్లీ స్థానం కాబట్టి పెద్దగా పట్టించుకోకపోయినా ఫరక్ ఉండదు కానీ… తిరుపతి విషయంలో మాత్రం కేంద్ర పెద్దలు ఓ లుక్ వేయాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే.. అది లోక్‌సభ స్థానం. ఆ స్థానంలో వచ్చే ఫలితం దేశవ్యాప్త దృష్టిని ఆకర్షిస్తుంది.
అందుకే మోడీ, అమిత్ షాలు కాకపోయినా కనీసం.. జేపీ నడ్డా, రాజ్‌నాథ్‌లతో అయినా ప్రచారం చేయించాలన్న పట్టుదలతో బీజేపీ నేతలు ఉన్నారు. పవన్ కల్యాణ్ కూడా తనంతట తానుగా ప్రచారం చేయకపోవచ్చు. బీజేపీ అగ్రనేతలు ప్రచారానికి వస్తేనే ..వారితో పాటు ఆయన ప్రచారం చేసే అవకాశం ఉంది. ఓ భారీ బహిరంగసభ ప్లాన్ చేస్తే పవన్ హాజరయ్యే చాన్స్ ఉంది. మామూలు సందర్భాల్లో అయితే అది సాధ్యమయ్యేదేమో కానీ.. ఇప్పుడు ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో బిజీగా బీజేపీ అగ్రనేతలు టైం కేటాయించే అవకాశం లేదన్న చర్చే ఎక్కువగా నడుస్తోంది.