కొత్త సినిమాలతో… థియేటర్లు కళకళలాడుతున్నాయి. హిట్టా? ఫట్టా? అనేది పక్కన పెడితే, ప్రతీవారం కొత్త సినిమాలు జోరుగా వస్తున్నాయి. దాంతో… వసూళ్లు, రికార్డులు గురించి మాట్లాడుకునే వీలు దక్కుతోంది. ప్రతీవారం మూడు నాలుగు సినిమాలు వరుసబెట్టడంతో.. మంచి పోటీ చూసే అవకాశం దక్కుతోంది. ఈవారం కూడా.. రెండు పెద్ద సినిమాలు వీకెండ్ వార్లో నిలబడ్డాయి. అవే… `వైల్డ్ డాగ్ `, `సుల్తాన్`.
ఏప్రిల్ 2న ఈసినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. `వైల్డ్ డాగ్` ఓ యాక్షన్ డ్రామా. హైదరాబాద్ లో జరిగిన వాస్తవ ఘటనల నేపథ్యంలో సాగే కథ. గోకుల్ చాట్ దుర్ఘటన, ఆ సమయంలో హైదరాబాద్ లో జరిగిన వరుస బాంబు పేళ్లుళ్లే ఈ కథకు మూలం. ఉగ్రవాదుల ఆట కట్టించడానికి ఓ స్పెషల్ టీమ్ చేసిన సాహసాలేంటి? అనేది చూపించబోతున్నారు. ఈమధ్య కాలంలో నాగార్జున చేసిన పూర్తి స్థాయి యాక్షన్ సినిమా ఇదే. ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయి. నాగ్ కూడా ఈసారి ప్రమోషన్లని చాలా వినూత్నంగా ప్లాన్ చేశాడు. నెట్ ఫ్లిక్స్ లో నేరుగా విడుదల కావల్సిన సినిమా ఇది. ఈ సినిమాపై నమ్మకం ఉంచిన నాగార్జున… పట్టుబట్టి థియేటర్ రిలీజ్ జరిగేలా చూశాడు. `ఉరి` లాంటి బాలీవుడ్ సినిమాలు ఈ తరహా కాన్సెప్టులతోనే తయారయ్యాయి. వాటికి మంచి ఆదరణ లభించింది.
ఈరోజే కార్తి `సుల్తాన్` కూడా బరిలోకి దిగుతున్నాడు. రష్మిక లాంటి గ్లామరెస్ భామ నటించడం ఈ సినిమాకున్న అదనపు ఆకర్షణ. రష్మిక క్రౌడ్ పుల్లర్ గా మారిన నేపథ్యంలో… తనని చూడ్డానికైనా జనాలు థియేటర్లకు వస్తారని చిత్రబృందం నమ్ముతోంది. దానికి తోడు… తెలుగులో కార్తికి ఉన్న మైలేజీ ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. ప్రచార చిత్రాల్లో దమ్ము కనిపిస్తోంది. వందమంది బలవంతుల్ని ఓ తెలివైన వాడు ఎలా మలచుకున్నాడు? అనేది ఈ సినిమా కాన్సెప్టు. టీజర్, ట్రైలర్లలో వినిపిస్తున్న డైలాగులు, యాక్షన్ సీన్స్… ఈ సినిమాపై అంచనాల్ని భారీగా పెంచుతున్నాయి.
మొత్తానికి నాగ్ – కార్తీ ఇద్దరూ నువ్వా? నేనా? అన్నట్టుగానే బాక్సాఫీసు పోరుకు రెడీ అయ్యారు. రెండు సినిమాలలో మాస్ అప్పీల్ ఉన్న సినిమా `సుల్తాన్` అయితే.. మల్టీప్లెక్స్ ప్రేక్షకులు త్వరగా ఓన్ చేసుకోగలిగే కథ.. `వైల్డ్ డాగ్`. మరి.. ఈ రెండు సినిమాల జాతకం ఏమిటో తెలియాలంటే ఇంకొన్ని గంటలు ఆగాలి.