తెలుగు రాష్ట్రాలలో `వకీల్ సాబ్` మానియా మొదలైపోయింది. ఏప్రిల్ 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇప్పటికే.. ప్రమోషన్లు భారీగా జరుగుతున్నాయి. `వకీల్ సాబ్` ట్రైలర్ రాకతో.. ఈ సినిమా ప్రమోషన్లకు ఓ ఊపు వచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ తో దాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ఈ స్పీడుకు తెలంగాణ పోలీసులు అడ్డు కట్ట వేశారు. ఏప్రిల్ 3న యూసుఫ్‌గూడ పోలీస్ లైన్స్‌లోని స్పోర్ట్స్ గ్రౌండ్స్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే ఈ కార్యక్రమానికి అనుమతులు లభించలేదు. కరోనా కేసులు మళ్లీ విజృంభిస్తున్న వేళ… ఎలాంటి సభలు, సమావేశాలకు అనుమతులు లేవని తెలంగాణ పోలీసులు తేల్చి చెప్పేశారు.
అందుకే ఇప్పుడు వకీల్ సాబ్ ప్లానింగ్ మారింది. ఏప్రిల్ 4న ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించబోతున్నారు. ఈసారి హైటెక్స్ లో. ఇది వరకు 6 నుంచి 8 వేల మంది అభిమానులతో ఫంక్షన్ ఏర్పాటు చేసుకునేందుకు దిల్ రాజు అనుమతులు అడిగారు. ఈసారి అభిమానుల సంఖ్య 2 వేలకు పరిమితం కానున్నదని తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి చిరంజీవి, రామ్ చరణ్‌లు ముఖ్య అతిథులుగా వస్తారని ప్రచారం జరుగుతోంది. అయితే చిత్రబృందం ఈ విషయంలో ఇప్పటి వరకూ ఎలాంటి స్పష్టతా ఇవ్వలేదు.