మన హీరోలు 60 వచ్చినా.. కాలేజీ కుర్రాళ్లలా పోజు కొడుతుంటారు.నెత్తి మీద ఒక్క వెంట్రుక కూడా మెరవదు. అలాంటి ప్రయత్నాలు, ప్రయోగాలూ చేస్తే.. ఫ్యాన్స్ హర్టయిపోతారని వాళ్ల భయం. తమిళంలో అజిత్ అలా కాదు. బయట ఎలా ఉంటాడో, తెరపై కూడా అలానే కనిపించడానికి ప్రయత్నిస్తాడు. నెరిసిన జుత్తే తన గ్లామర్ రహస్యం. మేకప్పు జోలికి వెళ్లడు. వయసుకు తగిన పాత్రే పోషిస్తాడు. ఇప్పుడు ఈ విషయంలో అజిత్ ని ఫాలో అవ్వబోతున్నాడు నాగార్జున.
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో నాగార్జున ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. యాక్షన్ నేపథ్యంలో సాగే సినిమా ఇది. ఇందులో నాగ్ గెటప్ కొత్తగా ఉండబోతోందని తెలుస్తోంది. అసలు ఏమాత్రం మేకప్ వేసుకోకుండా నటించబోతున్నాడట. ఈ విషయాన్ని నాగ్ కూడా ధృవీకరించారు. ”అజిత్ మేకప్లేకుండా నటిస్తుంటాడు. ఈసారి నేనూ అదే ప్రయత్నం చేస్తున్నా. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వచ్చే సినిమాలో.. మేకప్ జోలికి వెళ్లడం లేదు. సహజంగా కనిపించబోతున్నా. హెయిర్ కలర్ కూడా వేసుకోను.. అంతలా నన్ను ఆ పాత్ర స్ఫూర్తినిచ్చింది” అని చెప్పుకొచ్చాడు నాగ్. ఏప్రిల్ 2న `వైల్డ్ డాగ్` విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్లలో నాగ్ బిజీగా ఉన్నాడు. ఆ తరవాత.. ప్రవీణ్ సత్తారు షూటింగ్ కొత్త షెడ్యూల్ ప్రారంభం కానుంది.