విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్యమం చల్లబడిపోతోందన్న ప్రచారం మధ్య.. సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ ఒక్క సారిగా కదలిక తీసుకు వచ్చారు. స్టీల్ ప్లాంట్ నిర్వాసితులతో కలిసి ఆయన విశాఖలో భారీ ర్యాలీ నిర్వహించారు. కలెక్టరేట్ ముట్టడించారు. ఈ సందర్భంగా అన్ని పార్టీలు.. కార్మిక సంఘాలు… ప్రజాసంఘాలు ఆయన నాయకత్వంలోనే… ముట్టడికి బయలుదేరాయి. చడీచప్పుడు లేకుండా సాగిన ఈ ముట్టడి స్టీల్ ప్లాంట్ ఉద్యమం చల్లబడలేదని నిరూపించింది. టీడీపీ నేతలు కూడా.. లక్ష్మినారాయణ నేతృత్వంలో ముట్టడికి వెళ్లారు. అంతకు ముందు రోజే.. లక్ష్మినారాయణ .. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టులో పిటిషన్ వేశారు.
మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాజీనామా చేశారు. అయితే.. ఆయన టీడీపీ ఎమ్మెల్యేకావడంతో ఉద్యమంపై రాజకీయ ముద్ర ఉటుందన్న అభిప్రాయం ఏర్పడింది. ఆయన జేఏసీ ఏర్పాటు చేయాలనుకున్నా ఇతర పార్టీలు మందుకు రాలేదు. అదే సమయంలో వైసీపీ సొంతంగా ఉద్యమం ప్రారంభించింది. ఓవైపు.. వైసీపీ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అధికారికంగా మద్దతు తెలుపుతున్నా.. విశాఖలో మాత్రం.. వ్యతిరేక ప్రకటనలు చేస్తోంది. ఈ పరిణామాల నేపధ్యంలో ఏ ముద్ర లేని నేత అయితే స్టీల్ ప్లాంట్ ఉద్యమం ముందుకెళ్తుందని భావించినట్లుగా తెలుస్తోంది.
వీవీ లక్ష్మినారాయణ… స్టీల్ ప్లాంట్ ఉద్యమానికి మద్దతు ప్రకటించిన తర్వాత ఒకటి రెండు సార్లు… గంటాతో భేటీ అయ్యారు. ఆ సమయంలో ఉద్యమ కార్యాచరణ కూడా ఖరారు చేసుకున్నట్లుగా తెలుస్తోంది. వీవీ లక్ష్మినారాయణ జనసేనకు కూడా రాజీనామా చేశారు. ఆయన ఇప్పుడు ఏ పార్టీలోనూ లేరు. దీంతో ఆయన నాయకత్వానికి అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుందనే అంచనాతో ఆయనను హైలెట్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కలెక్టరేట్ ముట్టడి ప్రారంభమేనని… వీవీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో మరింత భారీ పోరాటం చేయనున్నట్లుగా ఉద్యమకారులు చెబుతున్నారు. ఇదే నిజమైతే.. స్టీల్ ప్లాంట్ ఉద్యమంలో మరింత ఊపు రావడం ఖాయమని చెప్పుకోవచ్చు.