ఈరోజు ఆచార్యలోని తొలి గీతం `లాహే.. లాహే` విడుదల చేస్తామని చిత్రబృందం ప్రకటించడంతో.. చిరు ఫ్యాన్స్ అలెర్ట్ అయిపోయారు. సాధారణంగా.. అగ్ర హీరో సినిమా నుంచి వచ్చే తొలి పాట.. హీరోయిజం చుట్టూ తిరుగుతుంది. ఓ రకంగా అదే హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అయ్యింటుంది. `లాహే.. లాహే` కూడా అలాంటి పాటే అనుకున్నారు. పైగా చిరు స్టెప్పులతో కట్ చేసిన ప్రోమో చూసి, ఇంకా గట్టిగా ఫిక్సయిపోయారు. అలాంటి వాళ్లందరికీ `లాహే… లాహే` స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చింది. ఇది హీరోయిజం నిండదిన పాట కాదు. శివుడిపై సాగే ఓ రొమాంటిక్ గీతం. ఇందులో కాజల్ కూడా కనిపించనుంది. మధ్యలో వచ్చిన చిరు.. సరదాగా కొన్ని స్టెప్పులు వేస్తాడంతే. ఈ పాటలో మేల్ వాయిస్ కూడా లేదు. ధర్మస్థలి నేపథ్యంలో సాగే పాట. రామజోగయ్య శాస్త్రి తనదైన శైలిలో శివ పార్వతిల విరహాన్ని ఆవిష్కరించారు. మణిశర్మ బీట్, ఆ పాటని పాడిన పద్ధతి.. మధ్యలో చిరు గ్రేస్ఫుల్ స్టెప్పులూ `లాహే..`కి ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. మొత్తానికి `ఆచార్య` నుంచి ఓ మంచి ఆల్బమ్ రాబోతోందని తొలి పాటతోనే మణిశర్మ సంకేతాలు ఇచ్చేసినట్టైంది.