భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పోరాడటానికి మమతా బెనర్జీ సన్నాహాలు చేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ఖాయమని సర్వేలు వస్తూండటంతో .. గెలిచిన ఊపులో బీజేపీపై దేశవ్యాప్తంగా పోరాడాలని ఆమె నిర్ణయించుకుంది. ఇందు కోసం.. దేశవ్యాప్తంగా బీజేపీయేతర పార్టీలకు పిలుపునిస్తూ లేఖ రాశారు. కాంగ్రెస్ సహా కీలకమైన ప్రతిపక్షాలకు ఈ లేఖ పంపారు. వీరిలో తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఉన్నారు. ప్రజాస్వామ్యం, రాజ్యాంగంపై బీజేపీ చేస్తున్న దాడిని ఎదుర్కోవడానికి అంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని లేఖలో మమతా బెనర్జీ పేర్కొన్నారు.
లేఖలో ఏడు అంశాలను మమతా బెనర్జీ ప్రస్తావించారు. అందులో ప్రభుత్వం అంటే లెఫ్టినెంట్ గవర్నర్ అన్నట్లుగా మార్చేస్తూ తీసుకు వచ్చిన చట్టాన్ని ఆమె లేఖలో గుర్తు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారాలకు కత్తెర వేసి వాటిని మున్సిపాలిటీల స్థాయికి తీసుకెళ్లడానికి బీజేపీ కుట్ర చేస్తోందన్నారు. దేశంలో ఒకేపార్టీ అధికారంలో ఉండాలన్న కుట్ర చేస్తోందని దీదీ చెప్పుకొచ్చారు. తృణమూల్ చీఫ్గా మీ అందరితో కలిసి పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. మనం చేతులు కలిపే సమయం ఆసన్నమైందని లేఖలో పిలుపునిచ్చారు.
లేఖలో చాలా మంది పేర్లు ఉన్నా… అందరి దృష్టి కేసీఆర్ వైపే ఉంటుంది. మమతా బెనర్జీ లేఖలు రాసిన ఇతర నేతలు.. స్పష్టమైన అభిప్రాయంతో ఉన్నారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి బీజేపీకి వ్యతిరేకంగా పోయే పరిస్థితి లేదు. పోరు కూడా. ఇక స్టాలిన్, అఖిలేష్, తేజస్వి వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇక కేసీఆర్ సిద్ధమా కాదా అన్నదే సందేహం. మమతా బెనర్జీతో ఎప్పుడో మాట్లాడానని… బీజేపీపై యుద్ధమేననని ఆయన గతంలో ప్రకటించారు. అందుకే ఇప్పుడు మమతా బెనర్జీనే స్వయంగా పిలుపునిచ్చారు. ఆయన స్పందిస్తారా లేక… జాతీయ రాజకీయాలను ఇక పట్టించుకోకూడదనిసైలెంట్ గా ఉంటారా అన్నది ఇప్పుడు కీలకం.
ఒక వేళ… మమతాతో కలిసి బీజేపీకి వ్యతిరేకంగా పోరాటం చేయాలనుకుంటే.. కాంగ్రస్కు దగ్గరైనట్లు అవుతుంది. కాదంటే… బీజేపీకి దగ్గరగా ఉన్నట్లుగా అవుతుంది. ఈ డైలమాలో సీఎం కేసీఆర్ ఉండి ఉంటారు. ఏ నిర్ణయమూ తీసుకోకుండా.. వేచి చూసే ధోరణిలో ఉండే అవకాశమే ఉంది.