భారతీయ జనతా పార్టీ ఇతర రాష్ట్రాల్లో ఎన్నికల్లో గెలుపు కోసం ఇస్తున్న హామీలు అందరూ దటీజ్ బీజేపీ అనుకునేలా చేస్తున్నాయి. ఇతర రాష్ట్రాల్లో అలాంటి హామీలు ఇచ్చి గెలిచిన తర్వాత .. కుదరదు… అవసరం లేదని కుండబద్దలు కొట్టేసి.. ఎవరూ నోరెత్తకుండా చేయడానికి అన్ని రకాల అస్త్రాలు సంధిస్తున్న బీజేపీ.. ఇప్పుడు అవే హామీల్ని ఏ మాత్రం మొహమాటం లేకుండా పొరుగు రాష్ట్రాల్లో ఇస్తూండటం కలకలం రేపురోంది. మొన్న తమిళనాడులో పసుపుబోర్డు హామీ.. ఇప్పుడు… పుదుచ్చేరిలో ఏకంగా ప్రత్యేకహోదా హామీని ఇచ్చేశారు. ఈ హామీలను చూసి.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రజలు నోరెళ్లబెట్టాల్సి వస్తోంది.
కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరిలో అన్నాడీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో ఉన్న బీజేపీ దాని కోసం… ఇప్పటికే తెర వెనుక రాజకీయాలు పూర్తి చేసింది. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ… మొత్తంగా లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడీ చేతుల మీదుగానే అక్కడ పాలన సాగించారు. ఇప్పుడు నేరుగా తమ ప్రభుత్వమే ఏర్పాడాలనుకుంటున్న మోడి, షాలు… తరచూ అక్కడ ఎన్నికల ప్రచారసభల్లో పాల్గొంటున్నారు. అది సరిపోలేదేమో కానీ… పుదుచ్చేరి ప్రజల్ని ఆకట్టుకోవడానికి ఏకంగా ప్రత్యేకహోదా ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చేశారు. ఇప్పుడా హామీ వైరల్ అవుతోంది. ప్రత్యేకహోదా ఏ రాష్ట్రానికీ ఇవ్వడం లేదని.. ఇచ్చేది కూడా లేదని.. కేంద్రం చెబుతోంది. అధికారికంగా ఇలా చెబుతున్న బీజేపీ.. ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి… మాత్రం హామీలను ఇచ్చేస్తోంది.
తెలంగాణలో పసుపుబోర్డు ఇస్తామని… బీజేపీ పెద్దలందరూ వచ్చి నిజామాబాద్లో ప్రచారం చేశారు.ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని చెబుతోంది. దీనిపై రాజకీయ రగడ ఏర్పడుతోంది. కానీ తమిలనాడులో పసుపుబోర్డు ఏర్పాటు చేస్తామని హామీలు గుప్పిస్తున్నారు. దీంతో తెలంగాణలోనూ రాజకీయ రచ్చ అయింది. బీజేపీ అలాంటి హామీలు ఏమీ ఇవ్వలేదని చెప్పేందుకు.. బీజేపీ నేతలు ప్రయత్నిస్తున్నారు. కానీ తమ హామీల్ని నెరవేర్చేలా.. సొంత పార్టీపై ఒత్తిడి తెచ్చేందుకు మాత్రం సిద్ధపడటం లేదు. మొత్తానికి ఎన్నికలను టార్గెట్గా పెట్టుకుని ప్రజల్ని మభ్య పెట్టడం ఎలాగో బీజేపీ నేతలు చేసి చూపిస్తున్నారు.