విశాఖలో ఫ్యూజన్ ఫుడ్స్ అనే హోటల్‌ను కోర్టు సెలవులు చూసి కూల్చివేశారు గ్రేటర్ విశాఖ అధికారులు. పెద్ద ఎత్తున పోలీసులు.. హోటల్‌ను ఖాళీ చేయించేందుకు ఆరేడు లారీలు తీసుకు వచ్చి… మొత్తంగా కాంట్రాక్టర్‌కు చెందిన వస్తువులన్నింటినీ లారీల్లో ఎక్కించేసి పంపించేశారు. అక్కడ మొత్తం ఖాళీ చేయించేసి.. జీవీఎంసీ ఆస్తి అని బోర్డు పెట్టారు. తాను చట్టబద్ధంగా లీజు పొందానని.. కూల్చివేస్తే .. రోడ్డునపడతానని.. ఆ లీజు దాడులు అధికారుల కాళ్లు కూడా పట్టుకున్నాడు. కానీ ఎవరూ పట్టించుకోలేదు. తాను చేయాలనుకున్న విధ్వంసం చేసి వెళ్లిపోయారు. ఆయన కోర్టుకెళ్లారు. ఇప్పుడు కోర్టు తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చింది. మళ్లీ ఆయనకు ఆ స్థలం అప్పచెప్పాలని ఆదేశించింది. అధికారులు… పూర్తిగా అధికార ఉల్లంఘనకు పాల్పడ్డారని.. నిబంధనలు పట్టించుకోలేదని తేల్చారు. అయితే జరగాల్సిన నష్టం మాత్రం.. ఆ లీజుదారుడికి జరిగింది.
ఒక్క ఫ్యూజన్ ఫుడ్స్ మాత్రమే కాదు… జీవీఎంసీ ఎన్నికలకు ముందు వరకూ.. శని, ఆదివారాలు వస్తే.. ఎవరి వ్యాపార సంస్థ కూల్చివేస్తారో.. ఎవరి ఇళ్ల గోడలు కూల్చివేస్తారోనన్న ఆందోళన నగర వాసుల్లో ఉండేది. ఎవరూ కోర్టుకు వెళ్లకుండా.. కోర్టుకు సెలవులు అయినప్పుడే ఇవి సాగేవి. పెద్ద ఎత్తున గోడల కూల్చివేతలు.. స్వాధీనాలు చోటు చేసుకున్నాయి. గీతం లాంటి విద్యా సంస్థ… సబ్బం హరి లాంటి ప్రతిపక్ష నేత ఇంటిని కూడా వదల్లేదు. అవన్నీ నిబంధనలకు వ్యతిరేకం కాదని ఎవరు చెప్పినా వినిపించుకునేవారు కాదు. పరిస్థితిని చూసి.. బీజేపీ నేత విష్ణుకుమార్ రాజు లాంటి వాళ్లు.. విశాఖలో కోర్టులు వారంలో ఏడు రోజులూ పని చేసేలా చూడాలని డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. అయినా ఆ కూల్చివేతలు అలా సాగుతూనే ఉన్నాయి.
ఇప్పుడు ఫ్యూజన్ ఫుడ్స్ విషయంలో విశాఖ అధికారులు వవ్యవహరించిన తీరును హైకోర్టు తప్పు పట్టింది. ఇప్పుడు ఇతరులు కూడా.. తమ తమ వ్యాపారాలు, ఇళ్ల కూల్చివేతలపై చాలా మంది కోర్టులకు వెళ్లారు. వారికి కూడా అనుకూలంగా తీర్పు వచ్చినా జరిగిన నష్టం జరిగిపోయింది. ఈ కూల్చివేతల్లో పాల్గొన్న అధికారులకు ఎలాంటి ఇబ్బంది లేదు. అక్రమంగా కూల్చివేతలు చేశారని తేలినా వారిపై చర్యలుండవు. కానీ నష్టపోయిన వారికి మాత్రం… నష్టం మిగిలే ఉంటుంది. ఖచ్చితంగా ఇదే.. ఆ కూల్చివేతల వెనుక రాజకీయం అనే విమర్శలు కూడా ఎప్పటి నుండో ఉన్నాయి.